పుట:సత్యశోధన.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

381

మార్వాడీ సోదరులు మాట ఇచ్చారు. అయితే నేను చంపారన్ వెళ్లలేక పోయినందున ఆ పని అసంపూర్తిగా వుండిపోయింది. బేతియాలో గోశాల నడుస్తున్నదేగాని అది ఆదర్శవంతమైన క్షీరశాలగా రూపొందలేదు. చంపారన్‌లో ఎద్దుల చేత అపరిమితంగా పని చేయిస్తున్నారు. హిందువులు ఎద్దుల్ని చావకొట్టి ధర్మానికి హాని కలిగిస్తున్నారు. ఆ ముల్లు నా హృదయంలో గుచ్చుకొని అలాగే వుండిపోయింది. చంపారన్ వెళ్లినప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ పనులను గురించి తలచుకొని నిట్టూర్పువిడుస్తూ వున్నాను. వాటిని అసంపూర్తిగా వదిలినందుకు మార్వాడీ సోదరుల్ని, బీహారీల్ని మందలిస్తూ వున్నాను. పాఠశాలలు అనుకున్న విధానంలో కాకపోయినా ఏదో విధంగా నడుస్తున్నాయి. కాని గోసంరక్షణ కార్యక్రమం అసలు ప్రారంభమేకాలేదు. అనుకున్నట్లు సాగలేదు. అహమదాబాదులో ఖేడాను గురించి చర్చలు జరుగుతూ వున్నప్పుడే నేను కార్మికుల పనికి పూనుకున్నాను.

నా స్థితి కడు సున్నితంగా వున్నది. కార్మికుల పక్షం బలంగా వున్నది. శ్రీ అనసూయాబెన్ తన సొంత అన్నతో పోరాటం సాగించవలసివచ్చింది. కార్మికులకు, యజమానులకు మధ్య ప్రారంభమైన ఈ దారుణపోరాటంలో శ్రీ అంబాలాల్ సారాభాయి ముఖ్యులు. మిల్లు యజమానులతో నాకు ప్రేమ సంబంధం వున్నది. వారితో పోరాటం జరపడం యిబ్బందికరమైన విషయం. కార్మికుల విషయమై వారిని కలిసి పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినమని ప్రార్ధించాను. కాని యజమానులు తమకు, తమ కార్మికులకు మధ్య నా మధ్యవర్తిత్వం అంగీకరించము అని స్పష్టంగా చెప్పివేశారు. కార్మికులకు సమ్మె చేయమని సలహా ఇచ్చాను. ఈ సలహా యిచ్చుటకు పూర్వం కార్మికులతోను, వారి నాయకులతోను బాగా కలిసి పోయాను. వాళ్లకు సమ్మె షరతులు తెలియజేశాను. ఆ షరతులు ఇవి.

  1. ఎట్టి పరిస్థితుల్లోను శాంతికి భంగం కలిగించకూడదు.
  2. పనికి వెళ్లదలచిన వారిని బాధించకూడదు.
  3. బిచ్చం మీద కార్మికులు ఆధారపడకూడదు.
  4. సమ్మె ఎంతకాలం నడిచినా గట్టిగా నిలబడాలి. దగ్గర డబ్బులేకపోతే మరోపని చేసుకొని పొట్టపోసుకోవాలి.

ఈ షరతులు నాయకులు తెలుసుకొని అందుకు అంగీకరించారు. కార్మికుల సభ జరిగింది. కోరికలు సబబైనవా కావా అని నిర్ణయించుటకు పంచాయతీ పెద్దల నియామకం జరగనంత వరకు పనిలోకి వెళ్లకూడదని కార్మికులు నిర్ణయించారు. ఈ సమ్మెకాలంలోనే శ్రీ వల్లభాయి మరియు శంకర్‌లాల్ బాంకరుగారలను, దగ్గరగా