పుట:సత్యశోధన.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

380

కార్మికులతో సంబంధం

వెల్లడించబడిన తరువాత కూడా చట్టం కానీయకుండా నిరోధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాని సర్ ఎడ్వర్డ్ గేట్ ధైర్యంగా వ్యవహరించి చట్టం చేయించాడు. దాన్ని అమలులోకి తెచ్చాడు కూడా. ఈ విధంగా 100 సంవత్సరాల నుండి అమల్లో వున్న తిన్‌కఠియా విధానం రద్దు అయింది. తెల్లదొరల రాజ్యం కూడా అస్తమించింది. అణగిపోయి పడివున్న రైతులు తమ శక్తిని గుర్తించారు. నీలిమందు మచ్చ కడిగినా పోదు అను భ్రమ తొలగిపోయింది. 

20. కార్మికులతో సంబంధం

నేను చంపారన్‌లో కమెటీలో చేరిపనిచేస్తూ వుండగా ఖేడానుండి మోహన్‌లాల్ పాండ్యా, శంకర్‌లాల్ పారిఖ్‌ల జాబు వచ్చింది. ఖేడా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. కనుక పన్నులు రద్దు చేయడం అవసరం. అక్కడికి వెళ్లి ప్రజలకు మార్గం చూపించమని వాళ్లు ఆ జాబులో కోరారు. ఖేడా వెళ్లి అక్కడి పరిస్థితులు స్వయంగా తెలుసుకోకుండా సలహాలివ్వాలనే కోరిక నాకు కలుగలేదు.

మరో జాబు కార్మిక సంఘం విషయమై శ్రీమతి అనసూయాబాయి వ్రాసింది. వేతనాలు పెంచమని చాలా కాలాన్నుండి కార్మికులు కోరుతున్న విషయం నాకు తెలుసు. అది చిన్న విషయమే, అయినా దూరాన్నుండి సలహాయిచ్చే స్థితిలో నేనులేను. అవకాశం చిక్కగానే నేను అహమదాబాదు వెళ్లాను. అక్కడి వ్యవహారాలు సరిచేసి చంపారన్ వెళ్లి నిర్మాణ కార్యక్రమాలు సాగిద్దామని భావించాను. కాని అహమదాబాదు చేరిన తరువాత పనుల వత్తిడివల్ల అనుకున్న ప్రకారం నేను చంపారన్ వెంటనే వెళ్లలేకపోయాను. అక్కడ నడుస్తున్న పాఠశాలలు ఒక్కొక్కటే మూతబడ్డాయని తెలిసింది. నేను, నా అనుచరులు అంతా ఏమేమో చేద్దామని ఆకాశంలో మేడలు కట్టాం. అవన్నీ కూలిపోయాయి. చంపారన్‌లో గ్రామ్య పాఠశాలతో బాటు గోసంరక్షణ కార్యక్రమం కూడా ప్రారంభించాము. గోశాల, హిందీ ప్రచారం రెండు కార్యక్రమాలు ఇజరామార్వాడీ సోదరులు నిర్వహిస్తామని చెప్పారు. బేతియాలో ఒక మార్వాడీ సజ్జనుడు తన ధర్మసత్రంలో నాకు ఆశ్రయం ఇచ్చాడు. బేతియాలోగల మార్వాడీ సోదరులు తమ గోశాల విషయంలో నన్ను ఒప్పించారు. గోసంరక్షణను గురించి ఇప్పుడు గల భావాలే ఆనాడు కూడా నాకు వున్నాయి. గోసంరక్షణ అంటే గోవంశవృద్ధి, గోజాతి సంస్కరణ, ఎద్దులచేత తగినంత పనినే చేయించడం, గోశాలను ఆదర్శవంతమైన క్షీరశాలగా రూపొందించడమన్నమాట. ఇందుకు పూర్తిగా సహకరిస్తామని