పుట:సత్యశోధన.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

378

అనుచరులు

తొలగించేందుకు సిద్ధపడలేదు. డా. దేవ్ అంత త్వరగా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. ఆయన, మిగతా వాలంటీర్లు కలిసి ఒక గ్రామంలో వీధులు శుభ్రం చేశారు. యిళ్ల ముందరపడియున్న పెంటకుప్పలు ఎత్తివేశారు. బావుల దగ్గర పడిన గుంటల్ని మట్టితో పూడ్చారు. పారిశుద్ధ్యం యీ విధంగా కొనసాగించమని జనానికి బోధించారు. కొన్ని చోట్ల జనం సిగ్గుపడి పారిశుద్ధ్యం పనులు చేశారు. కొన్ని గ్రామాలకు కారు వెళ్లుటకు మట్టి రోడ్ల వల్ల కటు అనుభవాలు కూడా కలిగాయి. పారిశుధ్యం మాట విని కొన్ని చోట్ల జనం అసహ్యించుకున్నారు. ఒక అనుభవాన్ని గురించి యిక్కడ వ్రాస్తాను. స్త్రీల సభల్లో అనేకసార్లు ఆ అనుభవాన్ని గురించి చెప్పాను. భీతిమరవా ఒక చిన్న గ్రామం. దాని సమీపంలో దానికంటే చిన్న పల్లె ఒకటి వున్నది. అక్కడి స్త్రీల బట్టలు చాలా మురికిగా వున్నాయి. ఆ మహిళలకు బట్టలు ఉతుక్కోమని, బట్టలు మార్చుకోమని చెప్పమని కస్తూరిబాకు చెప్పాను. ఆమె మహిళలతో మాట్లాడింది. వారిలో ఒక సోదరి ఆమెను తన గుడిసెలోకి తీసుకెళ్ళి “మీరే చూడండి, బట్టలు పెట్టుకునేందుకు మా గుడిసెలో పెట్టె బేడ ఏమీ లేదు. నేను కట్టుకున్న చీర దప్ప మరో చీర లేదు. దీన్ని ఎలా ఉతుక్కోవాలో చెప్పండి, మహాత్మునికి చెప్పి మాకు బట్టలిప్పించండి. రోజూ చీర ఉతుక్కుంటాను. చీర మార్చుకుంటాను” అని చెప్పింది. భారతదేశంలో ఇటువంటి గుడిసెలు అసంఖ్యాకంగా వున్నాయి. ఎన్నో గుడిసెల్లో సామానుగాని, పెట్టెగాని, బట్టలుగానీ ఏమీ వుండవు. ఎంతోమంది జనం కట్టుబట్టలతో జీవిస్తున్నారు.

మరో అనుభవం కూడా చెబుతాను. చంపారన్‌లో వెదురుగడలు, గడ్డి ఎక్కువ భితిహరమా గ్రామంలో నిర్మించిన పాఠశాల పైకప్పు వెదురుగడలతోనూ, గడ్డితోనూ తయారు చేయబడింది. ఎవరో ఒకనాటి రాత్రి దానికి నిప్పు అంటించారు. దగ్గరలో వున్న నీలిమందు తొట్టెల యజమానుల మనుష్యులు ఈ పనిచేశారని అనుమానం కలిగింది. దానితో వెదురు గడలతోనూ గడ్డితోనూ ఇల్లు కట్టడం విరమించాం. ఈ పాఠశాల శ్రీ సోమణ్ మరియు కస్తూరిబా నడుపుతూ వున్నారు. ఇటుకలతో పక్కా ఇళ్లు కట్టాలని సోమణ్ నిశ్చయించాడు. అతని శ్రమవల్ల ఇటుకలతో ఇల్లు తయారైంది. ఇల్లు తగులబడుతుందేమోనను భయం పోయింది.

ఈ పని బాగా జరగాలని నేను భావించాను. కాని మనోరధం నెరవేరలేదు. దొరికిన వాలంటీర్లు కొంత వ్యవధి వరకే వుండి పనిచేశారు. క్రొత్త కార్యకర్తలు దొరకడం కష్టం. చంపారన్‌లో పని పూర్తి అయిందో లేదో మరో పని నన్ను లాక్కు వెళ్లింది. ఏది ఏమైనా ఆరు నెలల పాటు అక్కడ సాగిన కార్యక్రమాలు వ్రేళ్ళూని, ఆ రూపంలోనే కాకపోయినా మరో రూపంలో తన ప్రభావం చూపుతూనే వున్నాయి.