పుట:సత్యశోధన.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

17


కొందరు ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు. అట్టివారిలో హైస్కూలు వాళ్ళు కూడా కొంతమంది వున్నారని చెప్పాడు.

ఇదంతా నాకు వింతగా తోచింది. తరువాత బాధ కూడా కలిగింది. వాళ్ళు, అలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. “మనం మాంసం తినం. అందువల్ల మనజాతి దుర్భలమై పోయింది. తెల్లవాళ్ళు మాంసభోజులు. అందువల్లనే వాళ్ళు మనల్ని పరిపాలించగలుగుతున్నారు. నన్నుచూడు. బలశాలిని. చాలా దూరం పరిగెత్తగలను. ఈ విషయం నీకు తెలుసు. నేను మాంసాహారి కావడమే అందుకు కారణం. మాంసాహారులకు కురుపులు లేవవు, గ్రంధులు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా వెంటనే మానిపోతాయి. మన ఉపాధ్యాయులు, రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు. వాళ్ళు మాంసం ఎందుకు తింటున్నారనుకుంటున్నావు? మాంసం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వాళ్ళకు బాగా తెలుసు. నువ్వు కూడా వారిలాగే మాంసం తిను. కృషితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మాంసం తిని చూడు నీకే తెలుస్తుంది. ఎంత బలం వస్తుందో అని నన్ను ప్రోత్సహించాడు.

ఇవి అతడు ఒక్క పర్యాయం చెప్పిన మాటలు కావు. అనేక పర్యాయాలు సమయాన్ని, సందర్భాన్ని బట్టి అతడు చెప్పిన మాటల సారం. మా రెండో అన్నయ్య యిది వరకే అతని మాటల్లో పడిపోయాడు. పైగా ఆ స్నేహితుని వాదనను సమర్ధించాడు కూడా. ఆ మిత్రుని ముందు, మా రెండో అన్నయ్య ముందు నేను దోమ వంటివాణ్ణి. వాళ్ళిద్దరూ బలిష్టులు. దృఢగాత్రులు. నా స్నేహితుని పరాక్రమం చూచి నివ్వెరపోయాను. ఎంత దూరమైనా సరే రివ్వున పరుగెత్తగలడు. ఎత్తు మరియు దూరం దూకడంలో అతడు మేటి. ఎన్ని దెబ్బలు కొట్టినా కిమ్మన్నడు. సహిస్తాడు. తరచుగా తన పరాక్రమాన్ని నా ముందు ప్రదర్శిస్తూ వుండేవాడు. తనకు లేని శక్తులు యితరుల్లో చూచి మనిషి ఆశ్చర్యపడడం సహజం. అందువల్ల నేను అతగాణ్ణి చూచి ఆశ్చర్యపోయేవాణ్ణి. అతని వలె బలశాలి కావాలని ఆశ నాకు కలిగింది. నేను దూకలేను. పరిగెత్తలేను. అతనిలా దూకాలి, పరిగెత్తాలి అనుకోరిక నాకు కలిగింది.

నేను పిరికివాణ్ణి. దొంగలన్నా, దయ్యాలన్నా, తేళ్ళన్నా, పాములన్నా నాకు భయం. రాత్రిళ్ళు గడపదాటాలంటే భయం. చీకట్లో ఎక్కడికీ పోలేను. ఒక దిక్కునుండి దయ్యాలు వచ్చి మ్రింగివేస్తాయని, మరోదిక్కు నుండి పాములు వచ్చి కరిచి వేస్తాయని భయం వేసేది. గదిలో దీపం లేకుండా పడుకోలేను. నా ప్రక్కనే పడుకొని నిద్రిస్తున్న యౌవనదశలోనున్న నా భార్యకు నా భయం గురించి ఎలా చెప్పను? నా