పుట:సత్యశోధన.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

376

అనుచరులు

ప్రారంభించిన తరువాత ఈ గ్రామాలలో విద్యాప్రచారం జరిగితే తప్ప ఇవి బాగుపడవనే నిర్ణయానికి వచ్చాము. ఎవరికీ చదువురాదు. పిల్లలు చదువులేక తిరుగుతుండేవారు. తల్లిదండ్రులు రెండు మూడు కాసుల కోసం నీలిమందు పొలాల్లో చచ్చేలా పనిచేస్తూ వుండేవారు. పురుషులకు రోజంతా పనిచేస్తే పది పైసల కూలి. స్త్రీలకు ఆరు పైసల కూలి, పిల్లలకు మూడు పైసల కూలి. నాలుగణాలు తెచ్చుకునే కూలీవాడు గొప్ప అదృష్టవంతుడుగా లెక్కింపబడేవాడు. సహచరులతో చర్చించి మొదట ఆరుగ్రామాల్లో పాఠశాలలు తెరిపించాను. గ్రామ పెద్ద యిల్లు యివ్వాలి. మాష్టారుకు అన్నం పెట్టాలి. మిగతా ఖర్చులు మేము భరించాలి. డబ్బు యివ్వలేదు కాని గ్రామస్తులు ధాన్యం యివ్వగల స్థితిలో వున్నారు. కనుక గింజలు ఇచ్చేందుకు గ్రామస్తులు సిద్ధపడ్డారు. యీ ఉపాధ్యాయులు ఎక్కడి నుండి వస్తారా అని ప్రశ్న బయలుదేరింది. బీహారులో జీతాలు లేకుండా పనిచేసే ఉపాధ్యాయులు లేరు, వున్నా తక్కువే. సామాన్యులైన ఉపాధ్యాయులకు పిల్లల్ని అప్పగించకూడదని నా అభిప్రాయం. ఉపాధ్యాయునికి చదువు రాకపోయినా ఫరవాలేదు గాని శీలవంతుడై వుండాలని గట్టిగా చెప్పాను.

ఇందుకోసం వాలంటీర్లు కావాలని ప్రకటించాను. గంగాధరరావు దేశపాండే నా ప్రకటనకు స్పందించి బాబా సాహెబ్ సామణ్ మరియు పుండలీక్‌ని పంపారు. బొంబాయి నుండి అవంతికాబాయి గోఖలే వచ్చారు. దక్షిణాది నుండి ఆనందీబాయి వచ్చింది. నేను ఛోటేలాలు, సురేంద్రనాధ్, నా చిన్న పిల్లవాడు దేవదాసును పిలిపించాను. మహదేవదేశాయి, నరహరిపారీఖ్ గారలు వచ్చి కలిశారు. మహా దేవదేశాయి భార్య దుర్గాబెన్, నరహరిపారిఖ్ భార్య మణిబెన్ కూడా వచ్చారు. కస్తూరిబాయిని కూడా పిలిపించాను. యింతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాండ్రు సరిపోతారని భావించాను. శ్రీమతి అవంతికాబాయి, ఆనందీబాయి, చదువుకున్నవారే కానీ మణీబెన్ పారీఖ్, దుర్గాబెన్ దేశాయి గార్లకు కొద్దిగా గుజరాతీ వచ్చు. కస్తూరీబాయికి చదువురానట్లే లెక్క. వీరు పిల్లలకు హిందీ ఎలా నేర్పగలరు? వీరు పిల్లలకు వ్యాకరణం చెప్పనవసరం లేదు, నడవడిక నేర్పితే చాలు. అని వారికి చెప్పాను. వ్రాయడం, చదవడం కంటే వాళ్లకు పారిశుద్ధ్యాన్ని గురించి చెప్పాలి. హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పెద్ద తేడా లేదని మొదటి తరగతిలో అంకెలు నేర్పమని అందువల్ల నీకు కష్టం ఉండదని చెప్పాను. తత్‌ఫలితంగా మహిళల క్లాసులు బాగా నడిచాయి. మహిళలకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వాళ్లు తమ క్లాసులకు ప్రాణం పోశారు. వాళ్లు బాగా పాఠాలు చెప్పారు. యీ సోదరీమణుల ద్వారా గ్రామ మహిళలతో కూడా మాకు బాగా