పుట:సత్యశోధన.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

375

విపరీతంగా భయపడుతూ వుండేవారు. వారి భయం పోయింది. వాళ్లు చెప్పే కథల్లో అతిశయోక్తులు తగ్గిపోయాయి. అబద్ధాలు చెబితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో రైతులు నిజం చెబుతూవుండేవారు. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలడం నా లక్ష్యం కాదు. వారి హృదయాలను జయించాలనే ఉద్దేశ్యంతో నా యీ సంగ్రామం సాగింది. ఫలానా దొరకు వ్యతిరేకంగా వాఙ్మూలాలు వచ్చాయని తెలియగానే జాబులు వ్రాసి వారికి తెలియజేయడమేగాక, వారిని కలిసి మాట్లాడుతూ వుండేవాణ్ణి. తెల్లదొరల బృందాన్ని కలసి వారి సాక్ష్యాలు కూడా సేకరించడం ప్రారంభించాను. వారిలో కొందరు నన్ను అసహ్యించుకునేవారు. కొందరు తటస్థంగా వుండేవారు. కొందరు మంచిగా వ్యవహరించేవారు. 

17. అనుచరులు

ప్రజకిషోర్‌బాబు మరియు రాజేంద్రబాబుగారలది గొప్ప జోడి. వారిద్దరూ తమ అమితప్రేమచే నన్ను, తాము లేకపోతే ముందుకు సాగలేనంతగా నిర్వీర్యుణ్ణి చేసివేశారు. వారి శిష్యులు లేక అనుచరులు శంభూబాబు, అనుగ్రహబాబు, ధరనీబాబు, రామనవమీ బాబు మొదలగు వకీళ్లు దరిదాపు నా వెంటనే వుండేవారు. యిది బీహారీ సంఘం. రైతుల వాఙ్మూలాలు రాయడం వారి పని. ఆచార్య కృపలానీ మాతో కలవకుండా వుండగలరా? వారు స్వయగా సింధీలే అయినా బీహారులో వుంటూ బీహారీగా మారిపోయారు. వారి వలె ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మరో ప్రాంతానికి వెళ్లి అక్కడివారితో కలిసిపోయి, తాము ఆ ప్రాంతంవారిలా మారిపోగలవారు బహుతక్కువ. ఆయన నాకు ద్వారపాలకుని వలె వ్యవహరించారు. చూడటానికి అసంఖ్యాకంగా వస్తున్నవారినుండి నన్ను రక్షించే బాధ్యత వారు వహించారు. అదే తమ జీవన సార్థకత అని భావించారు. ఆయన పరిహాసం చేస్తూ కొందరిని నా దగ్గరకు రాకుండా ఆపివేసేవారు. కొందరిని అహింసాత్మకంగా బెదిరించి ఆపేవారు. రాత్రిపూట ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించి అక్కడివారినందరిని నవ్విస్తూ, గుండెదిటవు లేనివారికి ధైర్యం చెబుతూ వుండేవారు.

మౌలానా మజహరుల్ హక్ నాకు సహాయకులుగా పేరు నమోదు చేయించుకున్నారు. నెలకు రెండు మూడుసార్లు వచ్చిపోతుండేవారు. వెనుకటి రోజుల్లోగల వారి దర్జాకు, ఆడంబరానికి యిప్పటి సాదా జీవనానికి ఎంతో వ్యత్యాసం వున్నది. మా దగ్గరకు వచ్చి మాలో కలిసిపోతూ వుండేవారు, చంపారన్‌లో పనిచేయడం