పుట:సత్యశోధన.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

372

కేసు ఉపసంహరణ

వ్యవహారానికి పెద్ద ప్రచారం లభించింది. చంపారన్‌లో, నాయీ కార్యక్రమానికి ప్రఖ్యాతి లభించింది. నేను అక్కడి పరిస్థితుల్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో కూడా నేను నిష్పక్షంగా వ్యవహరించడం అవసరమని అయితే అందుకు పత్రికా విలేఖరులను తీసుకొని వెళ్లి వాళ్ల ప్రకటనలు వెలువరించవలసిన అవసరం లేదని నిర్ణయించాను. వాళ్లు పెద్ద పెద్ద రిపోర్టులు పత్రికల్లో ప్రకటిస్తే అపకారం కూడా జరుగవచ్చు. అందువల్ల చాలామంది పత్రికా సంపాదకులకి మీ విలేఖర్లను పంపవద్దని అవసరమైన వివరాలు నేనే మీ విలేఖర్లకు అందజేస్తూ వుంటానని జాబులో వ్రాశాను. చంపారన్‌లో గల తెల్ల ఖామందులు బాగా కోపంగా వున్నారని నాకు తెలుసు. అధికారులు కూడా లోపల సంతోషంగా వుండరని తెలుసు. వాళ్లకు కోపం వస్తే నన్నేమీ చేయలేరు కాని పాపం అక్కడి నిరు పేదలగు రైతుల్ని యమబాధలు పెడతారని, అందువల్ల నేను చేయదలచుకున్న విచారణ సరిగా జరుగదని గ్రహించాను. తెల్లదొరలు అప్పుడే విషప్రచారం ప్రారంభించారు. వాళ్లు నాకు, నా అనుచరులకు వ్యతిరేకంగా అబద్ధపు ప్రకటనలు పత్రికల్లో ప్రకటించడం ప్రారంభించారు. నేను ఎంతో జాగ్రత్తగా వున్నందున, బహు చిన్న విషయాలలో సైతం సత్యం మీద ఆధారపడియున్నందున తెల్లదొరలు ప్రయోగించిన బాణాలు గురి తప్పిపోయాయి. ప్రజకిషోర్‌బాబును బాగా దుమ్మెత్తి పోశారు. తెల్లదొరలు వారిని నిందించిన కొద్దీ వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరిగిపోయాయి.

ఇట్టి సున్నితమైన వాతావరణంలో రిపోర్టర్లను వెంటవుండమని నేను ప్రోత్సహించలేదు. నాయకుల్ని కూడా ఆహ్వానించలేదు. “అవసరమైనప్పుడు తనను పిలవమని, తాను సిద్ధంగా వున్నానని” పండిత మదనమోహన మాలవ్యాగారు మనిషి ద్వారా వార్త పంపారు. అయినా వారికి కూడా నేను శ్రమ కలిగించలేదు. యీ సమస్యను నేను రాజకీయం చేయదలచలేదు. ఎప్పటికప్పుడు జరిగిన వివరాలు పత్రికలకు పంపుతూ వున్నాను. రాజకీయ సంబంధమైన వ్యవహారాలకు కూడా, రాజకీయ అవసరం లేనప్పుడు రాజకీయ రూపం కల్పించితే రెంటికీ చెడిన రేవడి చందమవుతుంది. యీ విధంగా అసలు విషయాన్ని స్థలం మారకుండా అక్కడే వుండనిస్తే అంతా సర్దుకుంటుందని నా విశ్వాసం. ఎన్నో పర్యాయాలు కలిగిన అనుభవం వల్ల నేను యీ విషయం గ్రహించాను. పరిశుద్ధమైన ప్రజా సేవయందు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా రాజకీయం తప్పక పనిచేస్తుంది. చంపారన్‌లో జరిగిన పోరాటం యీ విషయాన్ని రుజూ చేసింది.