పుట:సత్యశోధన.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

371

తనకు అందిన సమాచారం మీదనే ప్రభుత్వ ఆధారపడవలసి వస్తుంది. నేను ప్రజాహితం చేస్తూ అందుకు సంబంధించిన చట్టాల్ని ఆమోదించి ఆ ప్రకారం నడుచుకోవాలని భావించేవాణ్ణి. కాని నాకిచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని పాటించితే ప్రజలకు నేను న్యాయం చేయలేనని భావిస్తున్నాను. వారి మధ్యన వుండి మాత్రమే నేను యిక్కడి ప్రజలకు సేవ చేయగలనని నమ్ముతున్నాను. అందువల్ల నేను యిప్పుడు చంపారన్ విడిచి వెళ్లలేను. నాకిది ధర్మసంకటం. అందువల్ల చంపారన్ వదిలి వెళ్లమని ప్రభుత్వం యిచ్చిన ఆ దేశపు బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను.” “భారతదేశంలో ప్రజాజీవనమునందు నా వంటి గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తి ఒక చర్యకు పూనుకొన్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసియున్నదని నాకు తెలుసును. కాని నాకు యిక్కడ కల్పించబడిన పరిస్థితిని ఆత్మాభిమానం గల వ్యక్తి ఎవ్వడూ అంగీకరించలేడని చెప్పవలసిన అవసరం కలగడం దురదృష్టకరం. ప్రభుత్వ స్థానిక అధికారుల ఆదేశం కంటే, నా అంతర్వాణి పెద్దదని, దాని ఆదేశాన్ని పాలించడం నా కర్తవ్యమని భావిస్తున్నాను.”

నా ప్రకటనతో కేసును వాయిదా వేయవలసిన అవసరం లేకుండాపోయింది. యిలా జరుగుతుందని వకీలుగాని, మేజిస్ట్రేటుగాని ఊహించలేదు. అందువల్ల శిక్ష విధించేందుకు కోర్టువారు కేసును ఆపి వుంచారు. నేను యీ వివరమంతా తంతి ద్వారా వైస్రాయికి తెలియజేశాను. పాట్నాకు కూడా తంతి పంపాను. భారత భూషణ్ పండిత మదనమోహన మాలవ్యా వంటి పెద్దలకు కూడా తంతి పంపాను. నేను కోర్టుకు బయలుదేరబోతూ వుండగా వైస్రాయి గారి ఆదేశం ప్రకారం కేసును ఉపసంహరించుకోవడమైనదని మేజిస్ట్రేటు నాకు సమాచారం అందజేశాడు. మీరు చేయదలచిన పరీక్షలు చేయండి అని కలెక్టరు నుండి జాబు అందింది. అధికారుల సహాయం పొందవచ్చునని ఆ జాబులో ఆయన సూచించాడు. మా చర్యకు యింత త్వరగా శుభ పరిణామం కలుగుతుందని కలలో కూడా మేము ఊహించియుండలేదు.

నేను కలెక్టరు మి. హెకోసును కలిశాను. అతడు మంచివాడుగా కనబడ్డాడు. మీరు అవసరమనుకున్న పత్రాలన్నీ చూడవచ్చు. అవసరమని అనుకున్నప్పుడు మీరు తిన్నగా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఏ సాయం కావాలనన్నా మీకు అందిస్తాను అని ఆయన చెప్పాడు.

మరో వైపున భారతదేశానికి సత్యాగ్రహం అంటే ఏమిటో, చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించడం అంటే ఏమిటో పాఠం నేర్చినట్లయింది. పత్రికల ద్వారా నా యీ