పుట:సత్యశోధన.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

దు:ఖకరమైన ప్రకరణం - 1



6. దుఃఖకరమైన ప్రకరణం - 1

హైస్కూల్లో వేరు వేరు సమయాల్లో నాకు యిద్దరు స్నేహితులు వుండేవారు. వారిలో ఒకడితో మైత్రి ఎక్కువకాలం సాగలేదు. నేను మాత్రం ఆ మిత్రుణ్ణి పరిత్యజించ లేదు. మరొకనితో నేను స్నేహంగా వుండటం యిష్టం లేక అతడు నన్ను వదిలివేశాడు. యిక రెండోవానితో స్నేహం చాలా కాలం సాగింది. అది ఎంతో దుఃఖకరమైన ప్రకరణంగా మారింది. అతణ్ణి సంస్కరించాలనే భావంతో నేను అతనితో స్నేహం చేశాను

అతడు మొదట మా రెండో అన్నయ్యకు మిత్రుడు. వాళ్ళిద్దరూ సహాధ్యాయులు. అతనిలో కొన్ని దోషాలు వున్నాయి అని నాకు తెలుసు. అయినా అతడు విశ్వసనీయుడనే భావించాను. మా అమ్మ, పెద్దన్నయ్య, నా భార్య కూడా యీ చెడు సహవాసం వద్దని హెచ్చరించారు. అభిమానం గల భర్తనైన నేను భార్య మాటల్ని పాటిస్తానా? కాని మా అమ్మ, పెద్దన్నయ్య మాటల్ని వినడం తప్పనిసరి. “మీరు చెప్పిన దోషాలు అతనిలో వున్నవూట నిజమే. కాని అతనిలోగల సుగుణాలు మీకు తెలియవు. అతడు నన్ను చెడగొట్టలేడు. మంచిదారికి తీసుకొని వచ్చేందుకే అతనితో స్నేహం చేస్తున్నాను. తన దోషాల్ని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు. అందుకే అతనితో చేతులు కలిపాను. నన్ను గురించి మీరు విచారపడవద్దు” అని అమ్మకు, పెద్దన్నయ్యకు నచ్చజెప్పాను. నా మాటలు మా వాళ్ళకు నచ్చాయని అనలేను కాని యిక వాళ్ళు నన్నేమీ అనలేదు. నాదారిన నన్ను పోనిచ్చారు.

తరువాత నాదే పొరపాటని తేలింది. యితరుల్ని సంస్కరించడం కోసం మరీ లోతుకు పోకూడదని గ్రహించాను. స్నేహంలో అద్వైత భావం వుంటుంది. సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది, నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం. అసలు అతి స్నేహం పనికిరాదని నా అభిప్రాయం. సామాన్యంగా మనిషి సుగుణాల కంటే దుర్గుణాల్నే త్వరగా గ్రహిస్తాడు. ఆత్మీయమైత్రిని, భగవంతుని మైత్రిని కోరుకునేవాడు ఏకాకిగా వుండాలి. లేదా ప్రపంచమంతటితో స్నేహంగా వుండాలి. యీ నా అభిప్రాయాలు సరైనవో, కాదో తెలియదు. కాని నా ఆ స్నేహప్రయత్నం మాత్రం ఫలించలేదు.

ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు రాజకోటలో సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నది. మా ఉపాధ్యాయుల్లో చాలామంది చాటుగా మద్యమాంసాలు సేవిస్తున్నారని ఆ స్నేహితుడు నాకు చెప్పాడు. సుప్రసిద్ధులైన రాజకోటకు చెందిన