పుట:సత్యశోధన.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

363

12. నీలి మందు మచ్చ

చంపారన్ రాజర్షి జనకుని భూమి. చంపారన్ మామిడితోటలు వున్నట్లే నీలిమందు ఉత్పత్తి చేస్తూ వుండేవారు. చంపారన్ రైతులు తమ భూమిలో 3/20 భాగంలో తప్పనిసరిగా తమతెల్ల యజమాని కోసం నీలి మందు చట్టరీత్యా ఉత్పత్తి చేయవలసి వచ్చేది. దీన్ని తిన్‌కఠియా రివాజు అని అనేవారు. 20 కుంట (ఐదుమూరల నాలుగు అంగుళాల భూమి) లు అక్కడ ఒక ఎకరం. అందు 3 కుంటల్లో నీలిమందు ఉత్పత్తి చేయడాన్ని తిన్‌కఠియా రివాజు అని అనేవారు. అక్కడికి వెళ్లక పూర్వం నాకు చంపారన్ అను పేరు కూడా తెలియదు. అక్కడ నీలి మందు ఉత్పత్తి అవుతుందని కూడా నాకు తెలియదు. నీలిమందు బిళ్లలు చూచాను. కాని, అవి చంపారన్‌లో ఉత్పత్తి చేయబడతాయిని, అందువల్ల అక్కడి రైతులు విపరీతంగా నష్టపడుతున్నారని నాకు తెలియదు.

రాజకుమార్ శుక్లా చంపారన్‌కు చెందిన రైతు. ఆయన దాని వల్ల బాధపడ్డాడు. అయితే ఆ నీలి మచ్చను రైతులందరి హృదయాల నుండితొలగించి వేయాలనే అగ్ని అతని హృదయంలో రగుల్కొంది. లక్నో కాంగ్రెసుకు నేను వెళ్ళాను అక్కడే ఆ రైతు నన్ను పట్టుకున్నాడు. వకీలు బాబు నీకు అన్ని విషయాలు చెబుతారు. మీరు ఒకసారి చంపారన్ రండి అని ఆహ్వానించాడు. వకీలు అంటే చంపారన్‌లో గల నా అనుంగు అనుచరుడు. బీహారులో సేవాజీవులకు ప్రాణం వంటవాడునగు ప్రజ కిషోర్‌బాబు. రాజకుమార్ శుక్లా ఆయనను నా డేరాకు తీసుకొని వచ్చాడు. ఆయన నల్లని జుబ్బా, ప్యాంటు మొదలగునవి ధరించి వున్నాడు. చూడగానే ఆయన ప్రభావం నా మీద పడలేదు. అమాయకులైన రైతులను పీల్చే వకీలు అయివుంటాడని అప్పుడు అనిపించింది.

నేను చంపారన్ కథ ఆయన ద్వారా కొద్దిగా విన్నాను. నా సహజ పద్దతిలో “స్వయంగా చూడందే నేను నిర్ణయం ప్రకటించను. మీరు కాంగ్రెసులో యీ విషయం మీద మాట్లాడండి. ప్రస్తుతం నన్ను వదలండి” అని అన్నాను. రాజకుమార్ శుక్లాకు కాంగ్రెసుతో అవసరం ఎలాగూ ఉన్నది. చంపారన్ పరిస్థితిని గురించి మహాసభలో ప్రజకిషోర్ బాబు ప్రసంగించారు. అందు సానుభూతి తీర్మానం కూడా ప్యాసైంది.

రాజకుమార్ శుక్లాకు సంతోషం కలిగింది కానీ తృప్తి కలుగలేదు. నాకు చంపారన్ రైతుల కష్టాలు స్వయంగా చూపించాలని భావించాడు. నా యాత్రలో భాగంగా చంపారన్ చేరుతాను. ఒకటి రెండు రోజులు అక్కడ వుంటాను అని చెప్పాను.