పుట:సత్యశోధన.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

నా ప్రయత్నం

ధర్మసంకటంలో పడవలసిన అవసరం వారికి కలుగకుండా పోయింది. వారికి నా యెడగల ప్రేమ యింకా అధికమైంది. సొసైటీలో చేరుటకు పంపిన దరఖాస్తు తిరిగి తీసుకోవడం వల్ల నేను సొసైటీ సభ్యునిగా చేరినట్లే అయింది.

తరువాత నేను సొసైటీలో చేరకపోవడమే మంచిదని అనుభవంలో తేలింది. కొందరు నన్ను చేర్చుకోవద్దని తెలిపిన విషయాలు యదార్ధమైనవే. వారికి నాకు సిద్ధాంతరీత్యా తేడా వున్నమాట నిజం. అభిప్రాయ భేధం ఏర్పడినప్పటికీ మాకు గల ఆత్మ సంబంధం ఎన్నడూ చెక్కుచెదరలేదు. మేము మిత్రులంగానే వున్నాము. సొసైటీ స్థలం నా దృష్టిలో తీర్ధక్షేత్రమే. లౌకిక దృష్ట్యా నేను సొసైటీ మెంబరుగా చేరలేదు కాని ఆధ్యాత్మిక దృష్ట్యా నేను మెంబరుగా చేరినట్లే. వాస్తవానికి లౌకిక సంబంధం కంటే ఆధ్యాత్మిక సంబంధం గొప్పది కదా! ఆధ్యాత్మికత్వం లేని లౌకిక సంబంధం ప్రాణం లేని దేహంతో సమానమేకదా! 

7. కుంభయాత్ర

డాక్టర్ ప్రాణజీవనదాస్ గారిని కలుసుకునేందుకు రంగూన్ వెళ్లవలసి వచ్చింది. త్రోవలో శ్రీ భూపేంద్రనాధ బోసుగారి ఆహ్వానం మీద కలకత్తాలో ఆగాను. అక్కడ బెంగాలీల సౌజన్యాన్ని అపరిమితంగా చవి చూచాను. అప్పుడు నేను ఫలాలు మాత్రమే తీసుకుంటూ వున్నాను. నాతోబాటు మా అబ్బాయి రామదాసు వున్నాడు. కలకత్తాలో దొరికే పండ్లు మొదలుగా గల వన్నీ కొని మా కోసం సిద్ధంగా వుంచారు. స్త్రీలు రాత్రంతా జాగరణచేసి పిష్తా మొదలగు వాటి బెరుళ్లు వలిచారు. తాజా పండ్లను ఎంతో అందంగా అమర్చారు. నా అనుచరులం కోసం రకరకాల పిండివంటలు సిద్ధం చేశారు. ఆ ప్రేమ ఆ అతిధి సత్కారం నాకు బోధపడింది. కాని ఒకరిద్దరు అతిధుల కోసం కుటుంబసభ్యులంతా యీవిధంగా శ్రమపడటం నాకు నచ్చలేదు. అయితే యీ కష్టాన్నుండి బయటపడే మార్గం నాకు కనబడలేదు.

రంగూన్ వెళ్లేటప్పుడు నేను ఓడలో డెక్‌మీద ప్రయాణించే యాత్రీకుణ్ణి. శ్రీ బోసుగారింటి వద్ద ప్రేమాధిక్యత. స్టీమరు మీద దారిద్ర్యపు ఆధిక్యత. డెక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. స్నానం చేసే చోటు మురికి కూపం. నిలబడేందుకు కూడా వీలులేని స్థితి. పాయిఖానా నిజంగా నరకమే. మలమూత్రాలు తొక్కుకుంటూ నడవడం లేక మలమూత్రాల మీదుగా దూకుతూ వాటిని దాటడం నావల్లకాలేదు. ఓడ అధికారి దగ్గరికి వెళ్లాను. కాని వినిపించుకునే నాధుడే లేడు.