పుట:సత్యశోధన.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

341

ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాలు సహించలేకపోయేవాడు. యీ మోతీలాలును నిండు యౌవ్వనంలో జబ్బు ఎత్తుకు పోయింది. బడవాణ్ శూన్యమైపోయింది.

రాజకోటచేరి మరునాడు ఉదయం ఆరోగ్యశాఖ అధికారి ఆదేశం ప్రకారం ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి వారికి నేను పరిచితుణ్ణే. అందువల్ల నన్ను చూచి డాక్టర్లు సిగ్గుపడ్డారు. ఆవిధంగా ఆదేశించిన అధికారి మీద కోపం తెచ్చుకోసాగారు. నాకు మాత్రం దోషం కనబడలేదు. అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అతడు నన్ను ఎరుగడు. ఒక వేళ నేనెవరినో తెలుసుకున్నా తనకు యివ్వబడ్డ ఆజ్ఞను పాలించడం అతని కర్తవ్యమేకదా! అంతా పరిచితులు కావడం వలన రాజకోటలో నన్ను ఆసుపత్రిలో వుంచకుండా యింటికి పంపి మా యింటిదగ్గరే నన్ను పరీక్షించారు. మూడో తరగతి ప్రయాణికుల్ని యీ విధంగా పరీక్షిస్తూ వుండటం వలన ఆ తరగతిలో ప్రయాణించే గొప్ప వాళ్లకు కూడా అట్టి పరీక్ష జరుగవలసిందే. అధికారులు కూడా పక్షపాతం వహించకూడదని నా అభిప్రాయం. అయితే అధికారులు మూడో తరగతి ప్రయాణీకుల్ని మనుష్యులుగా పరిగణించక జంతువులుగా పరిగణిస్తుంటారు. సంబోధించే తీరు చాలా అసభ్యంగా వుంటుంది. మూడో తరగతి ప్రయాణీకులు మాట్లాడేందుకు వీలులేదు. తర్కించేందుకు వీలు లేదు. అధికారులు చప్రాసీల్లా వాళ్లను చూస్తూవుంటారు. వాళ్లను నిలబెట్టి వేధిస్తారు. టిక్కట్టు తీసుకొని తిరిగి యివ్వక బాధిస్తారు? యీ బాధలన్నీ నేను స్వయంగా అనుభవించాను. యీ పరిస్థితుల్లో మార్పురావాలంటే చదువుకున్న వాళ్లు బీదవాళ్లుగా మారి, మూడో తరగతిలో ప్రయాణిస్తూ, ఆ ప్రయాణీకులకు చేకూరని ఏ సౌకర్యమూ తాముకూడా పొందకుండా అక్కడ కలిగే యిబ్బందుల్ని, అన్యాయాల్ని, బీభత్సాన్ని గట్టిగా ఎదిరించి వాటిని తొలగించాలి.

కాఠియావాడ్‌లో పర్యటించిన ప్రతిచోట జనం బీరం గ్రామంలో పన్ను వసూలు చేస్తున్న తీరు పట్ల అసమ్మతి తెలియజేశారు. వివరమంతా తెలుసుకొని లార్డ్ విల్లింగ్టన్ లోగడ నాకు యిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కాగితాలన్నీ చదివాను. సత్యం గ్రహించాను. బొంబాయి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. సెక్రటరీని కలిశాను. ఆయన అంతా విని విచారం వెల్లడించి ఢిల్లీ ప్రభుత్వం యీ విషయమై చూపుతున్న తీరును వివరించాడు. “మా చేతుల్లో వుంటే యీటోలుగేటును ఎప్పుడో ఎత్తి వేసే వాళ్లం. కాని అది తిన్నగా భారత ప్రభుత్వానికి సంబంధించినది కనుక మీరు వారి దగ్గరకు వెళ్లడం మంచిది” అని సెక్రటరీ చెప్పాడు.