పుట:సత్యశోధన.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

339

నా హృదయం పొంగిపోయింది. ఆశ్రమం కోసం డబ్బు వసూలు చేయవలసిన అవసరం లేకుండా పోయినందుకు ఆనందం కలిగింది. అంతేగాక ఏ సమస్య వచ్చినా నేనొక్కడినేగాక, నాకు మార్గం చూపించగలవారు మరొకరున్నారనే భావం కూడా కలిగింది. దానితో నెత్తిమీద వున్న బరువు దిగిపోయినట్లనిపించింది. కీ.శే. డాక్టర్ దేవ్‌ను పిలిచి “గాంధీ గారి పేరిట ఖాతా ప్రారంభించండి, ఆశ్రమ స్థాపనకు ప్రజా సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు గాంధీ కోరినంత యివ్వండి అని గోఖలేగారు ఆదేశించారు. ఇక నేను పూనా నుండి శాంతినికేతన్ వెళ్లే ఏర్పాటులో వున్నాను. చివరిరోజు రాత్రి గోఖలే నాకు నచ్చే విధంగా విందు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కొందరు మిత్రులను ఆ విందుకు ఆయన ఆహ్వానించారు. నేను భుజించే పదార్ధాలు అనగా ఎండు ద్రాక్ష వగైరా మరియు తాజా పండ్లు మాత్రమే వడ్డన చేయించారు. విందు ఏర్పాటు చేసిన చోటు వారి గది అతి సమీపంలో వుంది. వారి ఆరోగ్యం సరిగాలేదు. వారు విందులో పాల్గొనుటకు వీలులేని స్థితి. అయినా నాయందుగల ప్రేమ వారిని ఆగనిస్తుందా? ఏదో విధంగా వారు వచ్చి విందులో పాల్గొన్నారు. యింతలో మూర్ఛవచ్చి సొమ్మసిల్లిపోయారు. వారిని గదిలోకి చేర్చారు. ఆప్పుడప్పుడు వారు యీ విధంగా మూర్ఛపోతూ వుండటం జరుగుతూ వుంటుందట. విందు సాగించమని సందేశం పంపారు. సొసైటీ అనే ఆశ్రమం ముంగిట అతిథులు, ఇంటివాళ్లు, దగ్గరివాళ్లు అంతా కలిసి పెద్ద జంబుఖానా పరిచి దాని మీద కూర్చొని వేరు సెనగపప్పు, ఖర్జూరం మొదలగు వాటిని తింటూ ప్రేమతో చర్చలు జరుపుతూ, ఒకరి హృదయాలను మరొకరు తెలుసుకొనేందుకు ప్రయత్నించడం ఆ విందు యొక్క లక్ష్యం. అయితే గోఖలే గారికి వచ్చిన యీ మూర్ఛ మాత్రం నా జీవితంలో అసాధారణమైన ఘట్టంగా చోటుచేసుకున్నది. 

3. అది బెదరింపా?

మా అన్నగారు చనిపోయారు. వితంతువు అయిన మా వదినగారు తదితర కుటుంబీకులను కలుసుకునేందుకు రాజకోట మరియు పోర్‌బందర్ వెళ్లాను. దక్షిణ ఆఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ సంగ్రామ సమయమప్పుడు నేను నా దుస్తుల్ని గిరిమిటియా కూలీల కనుగుణ్యంగా సాధ్యమైనంత వరకు మార్చుకున్నాను. విదేశాలలో కూడా ఇంట్లో ఆ డ్రస్సే వేసుకునేవాణ్ణి. మన దేశం వచ్చిన తరువాత కాఠియావాడ్ దుస్తులు ధరించాలని భావించాను. కాఠియావాడ్ డ్రస్సు నా దగ్గర వున్నది. ఆ