పుట:సత్యశోధన.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

గోఖలే గారితో

ధర్మం. దక్షిణ ఆఫ్రికాలో నేను సదా యీ నియమాన్ని పాటించాను. యిక్కడకూడా అలాగే పాటిస్తాను అని సమాధానం యిచ్చాను. లార్డ్ విల్లింగ్టన్ ధన్యవాదాలు తెలిపి మీరు అవసరమని భావించినప్పుడు నన్ను కలుసుకోవచ్చు. ప్రభుత్వం కావాలని ఏ చెడ్డ పని చేయదలచదని మీరే గ్రహిస్తారు అని అన్నాడు. “ఈ విశ్వాసమే నాకు ఆధారం” అని అన్నాను.

నేను పూనా చేరాను. అక్కడి వివరాలన్నింటిని వ్రాయడం సాధ్యంగాదు. గోఖలేగారు, వారి సొసైటీ (భారత్ సేవక్ సమాజ్) సభ్యులు అంతా ప్రేమామృతంతో నన్ను తడిపివేశారు. నాకు జ్ఞాపకం వున్నంత వరకు గోఖలేగారు తమ సొసైటీ సభ్యులనందరినీ పూనా పిలిపించారు. వారితో అనేక విషయాలను గురించి అరమరికలు లేకుండా చర్చించాను. సొసైటీలో చేరమని గోఖలేగారు నన్ను గట్టిగా కోరారు. నాకూ అట్టి కోరిక కలిగింది. కాని సాసైటీ సభ్యులకు ఒక ధర్మ సందేహం కలిగింది. సొసైటీ ఆదర్శాలకు గాంధీ ఆదర్శాలకు, యిరువురి పని చేసే తీరుకు గల వ్యత్యాసం వారు గ్రహించారు. అందువల్ల నన్ను సొసైటీలో సభ్యునిగా చేర్చుకోవచ్చా లేదా అని వారు సందేహించారు. కాని గోఖలేగారి భావం వేరుగా వుంది. నేను నా ఆదర్శాల మీద ఎంత దృఢంగా వుంటానో యితరుల ఆదర్శాలను అంత దృఢంగా గౌరవిస్తానని, యితరులతో బాగా కలిసి పోగలనని గోఖలేగారికి తెలుసు. మా సభ్యులు యింకా యితరులతో కలిసి పోగల మీ స్వభావాన్ని గ్రహించలేదు. వారు తమ ఆదర్శాల విషయమై దీక్ష కలవారు. స్వతంత్ర భావాలు కలవారు. వారు మిమ్ము స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒక వేళ వారు స్వీకరించకపోయినా మీ యెడ వారికి ఆదరణ, ప్రేమ లేవని మాత్రం మీరు భావించవద్దు. ఈ ప్రేమాదరణల రక్షణ కోసమే వారు ఏ విధమైన ప్రమాదాన్ని కొనితెచ్చుకునేందుకు యిష్టపడటం లేదు. మీరు నియమ ప్రకారం సొసైటీ సభ్యులైనా కాకపోయినా నేను మాత్రం మిమ్ము సొసైటీ సభ్యులుగా భావిస్తున్నాను అని అన్నారు. నా అభిప్రాయాలను స్పష్టంగా గోఖలేగారికి చెబుతూ “నేను సొసైటీ సభ్యుడనైనా, కాకపోయినా నేను ఒక ఆశ్రమం స్థాపించి అందు ఫినిక్సులో వున్న నా అనుచరులను వుంచుతాను. నేను కూడా అక్కడ వుంటాను. నేను గుజరాతీ వాణ్ణి. కనుక, గుజరాత్ ప్రాంతానికి సేవచేస్తూ తద్వారా దేశానికి అత్యధిక సేవచేయాలని భావిస్తున్నాను. అందువల్ల నేను గుజరాత్ ప్రాంతంలో ఎక్కడైనా వుంటాను” అని ప్రకటించాను. నా అభిప్రాయం గోఖలేగారికి నచ్చింది. “మీరు అలాగే చేయండి. మా సభ్యులతో జరిగిన చర్చల పరిణామం ఎలా వున్నప్పటికీ మీరు మాత్రం ఆశ్రమానికి అవసరమైన డబ్బు నావద్ద స్వీకరించాలి. మీ ఆశ్రమాన్ని మా ఆశ్రమంగా భావిస్తాను అని గోఖలే అన్నారు.