పుట:సత్యశోధన.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

337

చెప్పవచ్చు. అప్పుడు చొక్కా, తలపాగా వగైరా దుస్తులు మంచివే ధరించాను. అయినా టిప్‌టాప్‌గా దుస్తులు ధరించియున్న అక్కడి వాళ్లమధ్య నేను విడిగా కనబడుతూ వున్నాను. ఏదో విధంగా అక్కడ పని ముగించుకొని నేను ఫిరోజ్‌మెహతాగారి ఒడిలో ఆశ్రయం పొందాను.

గుజరాతీ సోదరులు ఉత్సవం చేయకుండా వూరుకుంటారా? క్రీ.శే. ఉత్తమలాల్ త్రివేది ఆసభను ఏర్పాటు చేశారు. ఆ ఉత్సవ కార్యక్రమం గురించి ముందుగానే కొద్దిగా తెలుసుకున్నాను. ఆయన అధ్యక్షత వహించారో లేక ప్రధాన వక్తగా వున్నారో నాకు యిప్పుడు సరిగా గుర్తులేదు. కాని ఆయన క్లుప్తంగా మధురంగా ఇంగ్లీషులో ప్రసంగించారు. మిగతా ఉపన్యాసాలు కూడా ఇంగ్లీషులోనే జరిగినట్లు గుర్తు. నా వంతు వచ్చినప్పుడు నేను గుజరాతీలోనే ప్రసంగించాను. గుజరాతీ, హిందుస్తానీ భాషలయెడ నాకుగల పక్షపాత భావాన్ని కొద్దిగా వెల్లడించి గుజరాతీల సభలో ఇంగ్లీషు వాడకాన్ని వినమ్రతతో వ్యతిరేకించాను. అలాంటి భావం వ్యక్తం చేస్తున్నప్పుడు కొంచెం తటపటాయించాను. చాలాకాలం తరువాత దేశం వచ్చిన యితడు అవివేకంగా ప్రవాహానికి ఎదురీత ఈదుతూ వున్నాడే అని అనుకుంటారేమోనని భావించాను. ఏదిఏమైనా గుజరాతీ భాషలోనే మాట్లాడాను. ఎవ్వరూ నా మాటల్ని ఖండించలేదు. సహించారు. అందుకు నేను సంతోషించాసు. ఈ సభలో కలిగిన అనుభవంవల్ల యిప్పుడు ప్రజలు అనుకుంటున్న దానికి విరుద్ధంగా మాట్లాడినా యిబ్బంది కలుగదు అని గ్రహించాను. ఈ విధంగా రెండురోజులు బొంబాయిలో వుండి గోఖలేగారి అనుమతి పొంది పూనాకు బయలుదేరాను. 

2. గోఖలే గారితో

నేను బొంబాయి చేరగానే గోఖలేగారు “గవర్నరు మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నారు. పూనాకు వెళ్లే ముందు మీరు వారిని కలవడం మంచిది” అని వార్త పంపారు. ఆ ప్రకారం నేను బొంబాయి గవర్నరు గారిని కలుసుకునేందుకు వెళ్లాను. మామూలు మాటల తరువాత మీరు నాకు మాట యివ్వండి. ప్రభుత్వం విషయమై మీరేదైనా అడుగు వేయాలనుకుంటే ముందుగా నాతో మాట్లాడుతూ వుండండి” అని ఆయన అన్నాడు.

“ఆవిధంగా మాట యివ్వడం నాకు సులభమే. ఎవరికైనా వ్యతిరేకంగా వ్యవహరించదలుచుకున్నప్పుడు ఆవిషయం వారికి తెలిపి వారి అభిప్రాయం తెలుసుకోవడం, సాధ్యమైనంతవరకు వారికి అనుకూలంగా వ్యవహరించడం సత్యాగ్రహి