పుట:సత్యశోధన.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఐదవ భాగం

1. మొదటి అనుభవం

నేను దేశం చేరక ముందే ఫినిక్సు నుండి భారతదేశానికి రాదల్చుకున్న వాళ్లు వచ్చివేశారు. నిర్ణయం ప్రకారం వాళ్ల కంటె ముందుగా నేను రావాలి. కాని యుద్ధం కారణంగా నేను లండనులో ఆగిపోయాను. అయితే ఫినిక్సు నుండి వచ్చిన వారిని ఎక్కడ వుంచడమా అని ప్రశ్న బయలుదేరింది. అంతా కలిసి ఫినిక్సు ఆశ్రమంలో వుంటే మంచిదని భావించాను. ఫలానా చోటుకు వెళ్లమని చెబుదామంటే నాకు ఏ ఆశ్రమమూ తెలియదు. ఆండ్రూసును కలిసి వారు ఎలా చెబితే అలా చేయమని వ్రాశాను. వాళ్లను ముందు కాంగడీ గురుకులంలో వుంచారు. అక్కడ కీ.శే. శ్రద్ధానంద్ వాళ్లను తమ బిడ్డల్లా చూచుకున్నారు. తరువాత వారని శాంతినికేతనంలో వుంచారు. అక్కడ కవివర్యులు, వారి అనుచరులు వారి మీద ప్రేమామృతం కురిపించారు. ఆ రెండు చోట్ల వాళ్లకు కలిగిన అనుభవం వాళ్లకు నాకు చాలా ఉపయోగపడింది.

“కవివర్యులు, శ్రద్ధానంద్‌జీ, శ్రీసుశీలరుద్ర” యీ ముగ్గురిని ఆండ్రూసుగారు చెప్పే త్రిమూర్తులు అని అనేవాణ్ణి. దక్షిణాఫ్రికాలో ఆయన ఆ ముగ్గురిని అమితంగా పొగుడుతూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో జరిగిన అనేక సమావేశాలలో, అనేక సందర్భాలలో ఆండ్రూసు యీ ముగ్గురిని స్మరిస్తూ వుండేవారు. సుశీలరుద్ర గారి దగ్గర మా ముగ్గురు బిడ్డల్ని వుంచారు. రుద్రగారికి ఆశ్రమం లేదు. అందువల్ల వారి ఇంట్లోనే పిల్లల్ని వుంచారు. ఆ యింటిని నా బిడ్డలకు అప్పగించివేశారని చెప్పవచ్చు. రుద్రగారి పిల్లలు, నా పిల్లలు మొదటిరోజునే మమేకం అయిపోయారు. దానితో నా పిల్లలు, ఫినిక్సు నుండి వచ్చిన వాళ్లు శాంతినికేతనంలో వున్నారని తెలుసుకొని, గోఖలేగారిని కలుసుకొని వెంటనే శాంతినికేతనం వెళ్లాలని తొందరపడ్డాను.

బొంబాయిలో అభినందనలు స్వీకరించునప్పుడు నేను కొద్దిగా సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. మి. పేటిట్ గారి వద్ద నాకు స్వాగతోత్సవం ఏర్పాటు చేశారు. అక్కడ గుజరాతీలో సమాధానం యిచ్చుటకు నాకు ధైర్యం చాలలేదు. బ్రహ్మాండమైన భవనం, కండ్లకు మిరిమిట్లుగొలిపే లైట్లు. వైభవోపేతంగా వున్న ఆ ప్రదేశంలో గిర్మిట్‌కూలీల వెంట వున్న నాబోటి పల్లెటూరివాడికి స్థానం లేదని అనిపించింది. యీనాటి నా దుస్తుల కంటే ఆనాటి నా దుస్తులు కొంచెం బాగా వున్నాయని

336