పుట:సత్యశోధన.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

హైస్కూల్లో

నా చదువు మాత్రం ఆగిపోలేదు. హైస్కూల్లో నాకు మొద్దబ్బాయి అని పేరు రాలేదు. ఉపాధ్యాయులకు నా యెడ వాత్సల్యం మెండు. పిల్లవాడి నడతను గురించి, అతని చదువును గురించి ప్రతి సంవత్సరం స్కూలు నుండి ఒక సర్టిఫికెట్ తల్లిదండ్రులకు పంపుతూ వుంటారు. వాళ్లు ఎప్పుడూ నా నడతను గురించిగానీ, నా చదువును గురించి గానీ వ్యతిరేకంగా వ్రాయలేదు. రెండో తరగతి తరువాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను. అయిదవ, ఆరవ తరగతుల్లో నెలకు నాలుగు రూపాయలు ఆ తరువాత పది రూపాయల చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. యిందు నా తెలివితేటల కంటే నా అదృష్టం ఎక్కువగా పనిచేసిందని నా అభిప్రాయం. యీ వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కావు. సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్టు వచ్చిన వాళ్ళకు యిట్టి వేతనం లభించేది. 40 లేక 50 మంది గల తరగతిలో అప్పుడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు బహు తక్కువ.

నాకు తెలిసినంతవరకు తెలివితేటల్ని గురించిన గర్వం నాకు వుండేదికాదు. బహుమతులు లేక స్కాలర్షిప్పులు లభించినప్పుడు ఆశ్చర్యం కలిగేది. కాని నడతను గురించి మాత్రం జాగ్రత్తగా వుండేవాణ్ణి. ఆచరణలో దోషం కనబడితే ఏడుపు వస్తూ వుండేది. ఉపాధ్యాయులు నన్ను మందలించటం గానీ, అట్టి పరిస్థితి ఏర్పడటం గానీ నేను సహించలేకపోయేవాణ్ణి. నాకు బాగా జ్ఞాపకం. ఒక పర్యాయం నేను దెబ్బలు తినవలసి వచ్చింది. దెబ్బలు తగిలినందుకు నేను విచారించలేదు, దండనకు గురి అయినాననే బాధ అమితంగా కలిగింది. బాగా ఏడ్చాను. మొదటి తరగతిలోనో లేక రెండో తరగతిలోనో ఇలా జరిగింది. అప్పుడు దొరాబ్జీ ఎదల్జీగిమీ హెడ్ మాష్టరు. ఆయన విద్యార్థులకు యిష్టుడు. తాను నియమబద్ధంగా పనిచేస్తూ ఇతరులచేత పనిచేయించేవాడు. చదువు బాగా చెప్పేవాడు. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం, క్రికెటు అనివార్యం చేశాడు. నాకు అవి యిష్టంలేదు. నేను వాటిలో పాల్గొనేవాణ్ణి కాదు. నా అయిష్టం సరికాదని యిప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ రోజుల్లో చదువుకు, వ్యాయామానికి ఏ మాత్రం సంబంధం లేదని నేను అనుకునేవాణ్ణి. విద్యార్జనతో బాటు అనగా మానసిక శిక్షణతోబాటు వ్యాయామం శారీరక శిక్షణ కూడా, విద్యార్థికి అవసరమని తరువాత బోధపడింది. అయినా వ్యాయామంలో పాల్గొనక పోవడం వల్ల నాకేమీ నష్టం కలుగలేదని చెప్పగలను. తెరపగాలిలో వాహ్యాళి ఎంతో ప్రయోజనకర మైనదని చదివాను. ఆ సలహా నాకు నచ్చింది. దానిలో పెద్ద తరగతుల్లో చదువుకునేటప్పటి నుండి నాకు కాలినడకన వాహ్యాళికి వెళ్ళడం అలవాటైపోయింది. చివరివరకు ఈ