పుట:సత్యశోధన.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

325

మాటల్లో విచారం నిండి వున్నా ప్రేమమాత్రం అపరిమితంగా వెల్లడి అయింది. జీవరాజ్ మెహతా వైపు చూచి “ఇక గాంధీని బాధించకండి. ఆయన నిర్ణయానికి కట్టుబడి చేయగలిగిన చికిత్స చేయండి” అని అన్నారు.

డాక్టరు తన అసంతృప్తిని వెల్లడించారు. కాని తప్పనిసరికదా! పెసరనీళ్ళు త్రాగమని సలహా యిచ్చారు. అందు కొద్దిగా ఇంగువ కలపమని చెప్పారు. నేను అంగీకరించాను, ఒకటి రెండు రోజుల ఆ విధంగా చేశాను. నా బాధ యింకా పెరిగింది. పెసరనీళ్ళు పడలేదు. అందువల్ల నేను తిరిగి పండ్లు తినడం ప్రారంభించాను. డాక్టరు కొంత వైద్యం చేశారు. బాధ కొద్దిగా తగ్గింది. నా నియమాలు, నిబంధనలు చూచి డాక్టరు భయపడ్డారు. ఈ లోపున అక్టోబరు నవంబరు మాసాలలో ఇంగ్లాండులో ముమ్మరంగా ప్రారంభమయ్యే మంచును తట్టుకోలేక గోఖలేగారు ఇండియాకు బయలుదేరి వెళ్ళారు.

42. నొప్పి తగ్గేందుకు

నరాల నొప్పి తగ్గలేదు. కొంచెం కంగారు పడ్డాను. మందులవల్ల నొప్పి తగ్గదని, ఆహారంలో మార్పు వల్ల బయటి ఉపచారాలవల్ల నొప్పి తగ్గుతుందని భావించాను. 1890 లో అన్నాహారం మరియు యితర ఉపచారాల ద్వారా చికిత్స చేసే డాక్టర్ ఎలిన్సన్ గారిని పిలిపించాను. ఆయన వచ్చాడు. నా శరీరం వారికి చూపించాను. పాలను గురించిన నా నిర్ణయం తెలియజేశాను. ఆయన నాకు ధైర్యం చెప్పాడు పాలు అక్కర్లేదు. కొద్దిరోజులపాటు జిగురుపదార్థాలు తినవద్దు అని చెప్పాడు. ఒట్టి రొట్టె, పచ్చికూరలు, ఉల్లిపాయలు, పచ్చకూర, నారింజపండు తినమని చెప్పాడు. ఈ కూరలతో పాటు సొరకాయపచ్చడి తినవలసి వచ్చింది. మూడు రోజుల గడిచాయి. పచ్చికూరలు పడలేదు. ఈ ప్రయోగం పూర్తిగా చేసే స్థితిలో నా శరీరం లేదు. పైగా అట్టి శ్రద్ధ కూడా కలుగలేదు. 24 గంటలు కిటికీలు తెరిచివుంచమని, గోరువెచ్చని నీటితో స్నానం చేయమని, నొప్పిగా వున్న చోట తైలంతో మర్దన చేయమని, అరగంట సేపు తెరపగాలిలో తిరగమని సలహాయిచ్చాడు. ఈ సలహా నాకు నచ్చింది. నేను వున్న యింటి కిటికీలు ఫ్రెంచి పద్ధతిలో వున్నాయి. వాటిని పూర్తిగా తెరిస్తే వర్షపునీరు ఇంట్లోకి రాసాగింది. వెంటిలేటర్లు తెరుచుకోవు. అందువల్ల వాటి అద్దాలను తొలగించి వేసి 24 గంటలు గాలివచ్చేలా ఏర్పాటు చేయించాను. వర్షం జల్లులు లోపలికి రాకుండా వుండేలా కిటికీ తలుపులు కొంచెంగా మూసి వుంచాను. దానితో ఆరోగ్యం