పుట:సత్యశోధన.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

ఆత్మ శిక్షణ

చదువును గురించి శ్రద్ధ వహించడం నా పని. దానితో నేను తృప్తిపడేవాణ్ణి. అందువల్లనే వేరు వేరు వయస్సుల్లో గల పిల్లల్ని సైతం ఒకే గదిలో కూర్చోబెట్టి పనిచేయిస్తూ వుండేవాణ్ణి.

పాఠ్యపుస్తకాలను గురించి ప్రతిచోట గొడవ చేస్తూ వుంటారు. కాని పాఠ్యపుస్తకాల అవసరం నాకు కలుగలేదు. ప్రతి పిల్లవాడికి ఎక్కువ పుస్తకాలు యివ్వడం అవసరమని అనిపించలేదు. వాస్తవానికి పిల్లవాడికి నిజమైన పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడే. పాఠ్యపుస్తకాల ద్వారా నేను నేర్పిన పాఠ్యాంశాలు జ్ఞాపకం వున్నవి బహుతక్కువే. కంఠస్థం చేయించిన పాఠాలు మాత్రం నాకు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. కంటితో గ్రహించిన దానికంటే చెవితో విని తక్కువ శ్రమతో ఎక్కువ గ్రహిస్తాడు. పిల్లలచేత ఒక్క పుస్తకం కూడా పూర్తిగా చదివించినట్లు నాకు గుర్తులేదు.

నేను చాలా పుస్తకాలు చదివాను. నేను జీర్ణం చేసుకున్న విషయాన్నంతా పిల్లలకు బోధించాను. అది వాళ్ళకు యిప్పటికీ జ్ఞాపకం వుండి వుంటుందని నా విశ్వాసం. చదివించింది జ్ఞాపకం పెట్టుకోవడం వారికి కష్టంగా వుండేది. నేను వినిపించిన పాఠం వాళ్ళు వెంటనే నాకు తిరిగి వినిపించేవారు. చదవమంటే కష్టపడేవారు. వినిపిస్తూ నేను అలసిపోయినప్పుడు లేక నేను నీరసపడినప్పుడు వాళ్ళు రసవత్తరంగా నాకు వినిపిస్తూ వుండేవారు. వాళ్లకు కలిగే సందేహాలు వాటి నివృత్తికై వాళ్ళు చేసే కృషి, వాళ్ళ గ్రహణ శక్తి అద్భుతం. 

34. ఆత్మ శిక్షణ

విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ గరపడం కంటే వారికి ఆత్మ శిక్షణ గరపడం కష్టమనిపించింది. ఆత్మశిక్షణకు మత గ్రంధాల సాయం నేను పొందలేదు. పిల్లలు తమతమ మతాల మూలతత్వం తెలుసుకోవడం, తమ మత గ్రంధాలను గురించి కొద్దిగా నైనా వాళ్ళు తెలుసుకోవడం అవసరమని భావించాను. అందుకోసం నేను చేతనైనంతవరకు సౌకర్యం కలిగించాను. బుద్ధి వికాసానికి అది అవసరమని నా భావం. ఆత్మ శిక్షణ విద్యాభ్యాసంలో ఒక భాగమని టాల్‌స్టాయి ఆశ్రమంలో పిల్లలకు శిక్షణ గరిపే సమయంలో నేను తెలుసుకున్నాను. ఆత్మ వికాసం అంటే శీలనిర్మాణం. ఈశ్వరసాక్షాత్కారం పొందడం అన్నమాట. ఆత్మజ్ఞానం పొందునప్పుడు పిల్లలకు సరియైన బోధ అవసరం. మరో రకమైన జ్ఞానం వ్యర్ధం, హానికరం కూడా కావచ్చునని తెలుసుకున్నాను.