పుట:సత్యశోధన.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

307

వస్తూ వుండేది. ఉదయం పూట వ్యవసాయం, గృహకృత్యాలు, మధ్యాహ్నం భోజనం కాగానే క్లాసులు ఇంతకంటే అనుకూలమైన సమయం లభించలేదు.

అక్షరజ్ఞానం కల్పించేందుకు మూడుగంటల సమయం నిర్ణయించారు. క్లాసులో హిందీ, తమిళం, గుజరాతీ ఉర్దూ నేర్పవలసి వచ్చింది. పిల్లలకు వాళ్ళ మాతృభాషలో చదువు నేర్పాలని మా నిర్ణయం. ఇంగ్లీషు కూడా అందరికీ నేర్పుతూ వున్నాం. గుజరాతీ తెలిసిన హిందూ పిల్లలకు కొద్దిగా సంస్కృతం నేర్పే వాళ్ళం. ఈ పిల్లలందరికీ హిందీ నేర్పే వాళ్ళం. చరిత్ర, భూగోళం, గణితం అందరికీ నేర్పేవాళ్ళం. తమిళం, ఉర్దూ నేను నేర్పేవాణ్ణి.

స్టీమరుమీద, జైల్లో నేర్చుకున్న నా తమిళజ్ఞానం అంతటితో ఆగింది. ముందుకు సాగలేదు. పోప్ రచించిన “తమిళ స్వయంశిక్షక్” ద్వారా నేర్చుకున్న దానితో సరి. ఫారసీ అరబ్బీ శబ్దావలి సంగతి కూడా అంతే. ముస్లిం సోదరుల సహవాసం వల్ల నేర్చుకున్న ఉర్దూ, అరబ్బీ, ఫారసీ ఓడమీద నేర్చుకున్న దానితో సరి. హైస్కూల్లో నేర్చుకున్న సంస్కృతం, గుజరాతీ యీ మాత్రం పెట్టుబడితో పని నడపవలసి వచ్చింది. అందుకు సహకరించదలచి వచ్చిన వారికి నాకు వచ్చినంత కూడా రాదు. అయితే దేశభాషల యెడ నాకు గల ప్రేమ, శిక్షణా శక్తి మీద నాకు గల శ్రద్ధ, విద్యార్థుల అజ్ఞానం, వారి ఉదార హృదయం నా పనికి అమితంగా తోడ్పడ్డాయి.

తమిళ విద్యార్థులు దక్షిణ ఆఫ్రికాలో జన్మించినట్టివారే. అందువల్ల వాళ్ళకు తమిళం చాలా తక్కువగా వచ్చు. వాళ్ళకు లిపి అసలురాదు. అందువల్ల నేను తమిళ లిపి నేర్పవలసి వచ్చింది. పని తేలికగానే సాగింది. తమిళం మాట్లాడవలసి వస్తే తాము నన్ను ఓడించగలమని విద్యార్థులకు తెలుసు. కేవలం తమిళం మాత్రమే తెలిసిన వాళ్ళు నా దగ్గరకు వస్తే ఆ తమిళ పిల్లలు దూబాసీలుగా ఉపయోగపడుతూ వుండేవారు. ఈ విధంగా బండి నడిచింది. అయితే విద్యార్థుల ఎదుట నా అజ్ఞానాన్ని దాచడానికి నేను ఎన్నడూ ప్రయత్నించలేదు. మిగతా విషయాలవలెనే యీ విషయంలో కూడా వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అక్షరజ్ఞానంలో వెనకబడినప్పటికి వారి ప్రేమ, ఆదరణ బాగా పొందగలిగాను. ముస్లిం పిల్లలకు ఉర్దూ నేర్పడం తేలిక. వాళ్ళకు లిపివచ్చు. వాళ్ళను చదువులో ప్రోత్సహించడం, అక్కడక్కడ వారికి సహకరించడం నా పని.

దరిదాపు పిల్లలంతా చదువురానివాళ్ళే. స్కూల్లో చదువుకోని వారే. నేను నేర్పేది తక్కువ. వాళ్ళ సోమరితనం పోగొట్టి, చదవడానికి వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళ