పుట:సత్యశోధన.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

అక్షరజ్ఞానం

పనులుచేయడం వల్ల వాళ్ళ శరీరాలు గట్టి పడ్డాయి. ఈ పనులు అంతా సంతోషంతో చేస్తూ వుండేవారు. అందువల్ల వేరే వ్యాయామం అనవసరం అని తేలింది. ఈ పనులు చేయమంటే అప్పుడప్పుడు కొందరు పిల్లలు నఖరాలు చేస్తూ భీష్మిస్తూవుండేవారు. వారిని గురించి పెద్దగా పట్టించుకునేవాణ్ణికాదు. కఠినంగా వ్యవహరించి వాళ్ళ చేత పనిచేయిస్తూ వుండేవాణ్ణి. అప్పుడు సరేనని వెంటనే మరచిపోతూ వుండేవారు. ఈ విధంగా మా బండి సాగుతూ వున్నది. అయితే వాళ్ళ శరీరాలకు పుష్టి చేకూరింది.

ఆశ్రమంలో ఎవ్వరూ జబ్బు పడలేదు. గాలి, నీరు, పుష్టికరమైన ఆహారం యిందుకు కారణమని చెప్పవచ్చు. శారీరక శిక్షణతో బాటు వృత్తి విద్య కూడా గరపడం అవసరమని భావించాను. మి. కేలన్‌బెక్ ట్రేపిస్ట్ మఠం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టడం నేర్చుకువచ్చారు. వారి దగ్గర చెప్పులు కుట్టడం నేర్చుకొని యిష్టపడిన పిల్లలకు నేర్పాను. వడ్రంగం పని మి.కేలన్‌బెక్‌కు కొంతవచ్చు. అది వచ్చిన మరో వ్యక్తి కూడా ఆశ్రమంలో వున్నాడు. అందువల్ల ఆ పని కూడా కొందరికి నేర్పుతూ వున్నాం. వంటచేయడం పిల్లలంతా నేర్చుకొన్నారు. ఈ పనులన్నీ పిల్లలకు క్రొత్తే. కలలోనైనా యిట్టి పనులు నేర్చుకోవాలని వారు భావించలేదు. దక్షిణ ఆఫ్రికాలో భారతదేశ పిల్లలు కేవలం ప్రారంభవిద్య మాత్రమే పొందేవారు. ఉపాధ్యాయులు తాము చేసిన పనులే పిల్లలకు నేర్పాలని, తాము చేయని పనులు పిల్లలచేత చేయించకూడదని టాల్‌స్టాయి ఆశ్రమంలో నియమం అమలు చేశాం. పిల్లల చేత పని చేయిస్తూ వున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారి వెంట వుండి పని చేస్తూ చేయిస్తూ వుండేవాడు. అందువల్ల పిల్లలు సంతోషంగా పనులు చేస్తూ వుండేవారు. శీలం గురించి, అక్షరజ్ఞానం గురించి తరువాత వ్రాస్తాను. 

33. అక్షరజ్ఞానం

శారీరక శిక్షణతో బాటు కొన్ని చేతి పనులు పిల్లలకు నేర్పుటకు టాల్‌స్టాయి ఆశ్రమంలో చేసిన ఏర్పాట్లను గురించి ప్రకరణంలో వివరించాను. పూర్తిగా నాకు తృప్తికలగనప్పటికి అందుకొంత సాఫల్యం లభించిందని చెప్పగలను. అక్షరజ్ఞానం కల్పించడం కష్టమని అనిపించింది. అందుకు అవసరమైన సామాగ్రి నా దగ్గర లేదు. అవసరమని నేను భావించినంత సమయం కూడా యివ్వలేకపోయాను. అంతజ్ఞానం కూడా నాకు లేదు. రోజంతా కాయకష్టం చేశాక అలసి పోయేవాణ్ణి. విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పుడు క్లాసులో పాఠం చెప్పలేక బలవంతాన పాఠం చెప్పవలసి