పుట:సత్యశోధన.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

305

టాల్‌స్టాయి ఆశ్రమంలో బాలురకు బాలికలకు శిక్షణ ఇచ్చేందుకై ఏర్పాటు చేయవలసి వచ్చింది. హిందూ ముస్లిం క్రైస్తవ యువకులతో బాటు కొంతమంది బాలికలు కూడా మాతో ఉన్నారు. వారి శిక్షణ కోసం వేరే ఉపాధ్యాయుణ్ణి నియమించడం కష్టమని తేలింది. దక్షిణ ఆఫ్రికాలో భారతీయ ఉపాధ్యాయులు బహుతక్కువ. వున్నా పెద్ద జీతం యివ్వందే దర్బనుకు 21 మైళ్ళ దూరాన వున్న ఆశ్రమానికి ఎవరు వస్తారు. అంత డబ్బు నాదగ్గర లేదు. పైగా యిప్పటి విద్యావిధానం నాకు యిష్టం లేదు. సరియైన పద్ధతిని నేను ప్రయోగించి చూడలేదు. తల్లి దండ్రుల దగ్గర గరపబడే విద్య సరియైనదని నా భావం. అందువల్ల బయటి వారి సాయం తక్కువగా వుండాలని భావించాను. టాల్ స్టాయి ఆశ్రమం ఒక కుటుంబం వంటిదని, దానికి నేను తండ్రి వంటివాడినని అందువల్ల నేనే పిల్లల శిక్షణకు బాధ్యత వహించాలని నిర్ణయించాను. అయితే అందు పలు దోషాలు వున్నాయి. ఈ యువకులు జన్మించినప్పటినుండి నాదగ్గర లేరు. వేరు వేరు వాతావరణాల్లో పెరిగినవారు. వేరు వేరు మతాలకు చెందినవారు. ఇట్టి స్థితిలో తండ్రిగా బాధ్యతను ఎలా నిర్వహించగలనా అని అనుమానం కలిగింది. అయితే నేను హృదయ శిక్షణ అనగా మంచి నడతకు సంబంధించిన శిక్షణకు ప్రాముఖ్యం యిచ్చాను. ఏ వాతావరణంలో పెరిగినా, ఏ వయస్సువారికైనా, ఏమతాలవారి కైనా అట్టి శిక్షణ యివ్వవచ్చునని నా భావం. ఆ భావంతో రాత్రింబవళ్ళు ఆ పిల్లలతో బాటు తండ్రిగా వుండసాగాను. మంచి నడత అనగా శీలం ప్రధానమైనదని భావించాను. పునాది గట్టిగా వుంటే తరువాత విషయాలు పిల్లలు ఇతరుల ద్వారానో లేక తమంత తాముగానో నేర్చుకోగలరని నా అభిప్రాయం. అయినా అక్షర జ్ఞానం కొద్దో గొప్పో వారికి కల్పించాలని భావించి క్లాసులు ప్రారంభించాను. మి. కేలన్‌బెక్ ప్రాగ్జీ దేశాయిగారల సాయం పొందాను. శారీరక శిక్షణను గురించి నాకు తెలుసు. అది ఆశ్రమంలో వారికి సహజంగానే లభిస్తూవుంది.

ఆశ్రమంలో నౌకర్లు లేరు. పాయిఖానా దొడ్లు బాగుచేసుకోవడం నుండి వంటపని వరకు ఆశ్రమవాసులే చేసుకోవాలి. పండ్ల చెట్లు చాలా వున్నాయి. క్రొత్తగా నాట్లు వేయాలి. మి. కేలన్‌బెక్‌కు వ్యవసాయం అంటే ఇష్టం. ప్రభుత్వ ఆదర్శతోటలకు వెళ్ళి అభ్యసించి వచ్చారు. వంటపని చేస్తున్న వారిని మినహాయించి మిగతా పిన్నలు, పెద్దలు మొదలుగాగల ఆశ్రమవాసులందరూ ఏదో ఒక సమయంలో తోటలో కాయకష్టం చేసి తీరాలి. పిల్లలు ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేవారు. పెద్ద పెద్ద గుంటలు త్రవ్వడం, చెట్లు నరకడం, బరువు మోయడం మొదలగుగాగల