పుట:సత్యశోధన.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

301

పరిచయం అయినప్పుడు ఆయన పెట్టే ఖర్చుల్ని చూచి, ఆయన హంగులు, దర్పం చూచి నేను బెదిరిపోయాను. అయితే మొదటి కలయికలోనే ఆయన ధర్మాన్ని గురించి ప్రశ్నలు వేశాడు. మాటల్లో బుద్ధ భగవానుని త్యాగాన్ని గురించి చర్చ జరిగింది. ఆ తరువాత మా పరిచయం ఎక్కువైంది. దానితో మా సంబంధం గాఢమైపోయింది. నేను చేసే ప్రతి ప్రయోగం తాను కూడా చేయాలనే స్థితికి ఆయన వచ్చాడు. ఆయన ఒంటరివాడు. తన ఒక్కడి కోసం ఇంటి అద్దె వగైరాలు గాక నెలకు 1200 రూపాయలు దాకా ఖర్చు పెడుతుండేవాడు. తరువాత నిరాడంబరత్వం వైపుకు మొగ్గి చివరికి నెలకు 120 రూపాయల ఖర్చుకు చేరుకున్నాడు. నా కాపురం ఎత్తివేశాక, మొదటిసారి జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత నుండి ఇద్దరం కలిసి వుండసాగాం. అప్పుడు మా ఇద్దరి జీవనం మొదటి కంటే కఠోరంగా వుండేది. మేము కలిసి ఉంటున్నప్పుడే పాలు మానాలని చర్చ జరిగింది. మి. కేలన్‌బెక్ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ “పాల దోషాలను గురించి మనం తరుచు చర్చిస్తున్నాం. పాలు తాగడం విరమించి వేయకూడదా? పాల అవసరం లేదు కదా!” అని అన్నాడు. ఆయన మాటలు విని నాకు ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. ఆయన సలహాను సమర్ధించాను. మేమిద్దరం ఆ క్షణాన టాల్‌స్టాయ్ ఫారంలో పాలు తాగడం మానివేశాం. 1912లో ఈ ఘట్టం జరిగింది.

అంతటితో శాంతి లభించలేదు. పాలు విరమించిన తరువాత కొద్దిరోజులకు కేవలం పండ్లు మాత్రమే భుజించి ఉందామని నిర్ణయానికి వచ్చాం. కారు చవుకగా దొరికే పండ్లు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాం. కడు నిరుపేద జీవించే పద్ధతిన జీవించాలని మా ఇద్దరి ఆకాంక్ష. ఫలాహారంలో ఉండే సౌకర్యాలను ప్రత్యక్షంగా పొందాము. పొయ్యి వెలిగించవలసిన అవసరం లేకుండా పోయింది. పచ్చి వేరుసెనగపప్పు, అరటిపండ్లు, ఖర్జూరం పండ్లు, నిమ్మపండ్లు, పప్పునూనె ఇవే నా ఆహారం. బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని భావించేవారికి ఒక హెచ్చరిక చేయడం అవసరం. బ్రహ్మచర్యానికి, ఆహార పదార్థాలకు దగ్గర సంబంధం ఉన్నదని చెప్పానేగాని అసలు రహస్యం మనస్సుకు సుబంధించిందే. మైలపడ్డ మనస్సు ఉపవాసాలు చేసినా శుభ్రపడదు. ఆహారం దానిమీద ఏమీ పనిచేయదు. ఆలోచనలవల్ల, భగవన్నామస్మరణవల్ల, భగవంతుని దయవల్ల మనోమాలిన్యం తొలగుతుంది. అయితే మనస్సుకు, శరీరానికి దగ్గర సంబంధం ఉంటుంది. వికారంతో నిండిన మనస్సు వికారం కలిగించే ఆహారాన్ని వెతుకుతుంది. వికారంతో నిండిన మనస్సు రకరకాల