పుట:సత్యశోధన.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

సంయమం

దేశం వచ్చిన కొంతకాలం తరువాతనే వాటిని పుచ్చుకున్నాను. ఒక పర్యాయం ఇంగ్లాండులో 1914లో ఉప్పు, పప్పు తిన్నాను. దేశం వచ్చాక ఎందుకు తినవలసి వచ్చిందో ఆ కథ మరో ప్రకరణంలో చెబుతాను.

ఇతరుల మీద కూడా పప్పు ఉప్పును గుర్తించిన ప్రయోగం చేశాను. దక్షిణ ఆఫ్రికాలో మంచి ఫలితం చేకూరింది. ఆయుర్వేద వైద్యం దృష్ట్యా వాటిని వదలడం వల్ల లాభం చేకూరుతుందని చెప్పగలను. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహమూ లేదు. భోగికి, సంయమం కలిగిన వ్యక్తికి మధ్య ఆహారం విషయంలోను, అలవాట్ల విషయంలోను వ్యత్యాసం వుండవలసిందే. బ్రహ్మచర్య వ్రతపాలనను గురించి కోరిక గల వ్యక్తి భోగిగా జీవనం గడిపి తిరిగి బ్రహ్మచర్యం గడపాలంటే చాలా కష్టం. అది అసంభవం కూడా. 

30. సంయమం

కస్తూరి బాయి జబ్బు పడినప్పుడు ఆ కారణంగా నా ఆహారంలో ఎన్నో మార్పులు జరిగాయని గత ప్రకరణంలో వ్రాశాను. ఇక ఇప్పుడు బ్రహ్మచర్యం దృష్ట్యా నా ఆహారంలో మార్పులు ప్రారంభమైనాయి.

పాలు విరమించడం మొదటి మార్పు. పాలు ఇంద్రియ వికారం కలిగించే పదార్థం. ఈ విషయం మొదట నేను శ్రీ రాయుచంద్‌భాయి వల్ల తెలుసుకున్నాను. అన్నాహారాన్ని గురించి ఇంగ్లీషు పుస్తకాలు చదవనప్పుడు ఈ భావం బాగా బలపడింది. కాని బ్రహ్మచర్య వ్రతం పట్టిన తరువాతనే పాలు తాగడం విరమించగలిగాను. శరీర పోషణకు పాలు అనవసరమని చాలాకాలం క్రితమే గ్రహించాను. అయితే వెంటనే పోయే అలవాటు కాదుగదా! ఇంద్రియదమనం కోసం పాలు త్రాగడం మానాలి అను విషయం తెలుసుకోగలిగాను. ఇంతలో గోవుల్ని, గేదెల్ని కసాయివాళ్లు ఎంతగా హింసిస్తున్నారో తెలిపే కరపత్రాలు, వివరాలు కలకత్తా నుండి నాకు చేరాయి. ఆ సాహిత్య ప్రభావం నా మీద అపరిమితంగా పడింది. ఈ విషయమై నేను కేలన్‌బెక్‌తో చర్చించాను.

కేలన్‌బెక్‌ను గురించి దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో వ్రాశాను. గత ప్రకరణంలో కూడా కొద్దిగా వ్రాశాను. ఇక్కడ రెండు మాటలు వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. ఆయన మి. ఖాన్ స్నేహితుడు. తనలో వైరాగ్య ప్రవృత్తి నిండి ఉన్నదని ఆయన గ్రహించాడు. అందువల్లనే ఖాను ఆయనను నాకు పరిచయం చేశాడని నా అభిప్రాయం.