పుట:సత్యశోధన.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

299

వినిపించాను. అయినా ఆమె అంగీకరించలేదు. పప్పు ఉప్పు మానమని ఎవరైనా మీకు చెబితే మీరు మానతారా అని గట్టిగా అన్నది.

నాకు విచారం కలిగింది. సంతోషం కూడా కలిగింది. నా ప్రేమ ఎలాంటిదో పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. నీవు తప్పుగా యోచిస్తున్నావు. నాకు జబ్బు చేసి వైద్యుడు ఏ వస్తువైనా తినవద్దని చెబితే తప్పక వదిలివేస్తాను. అయినా, ఇదిగో, ఇప్పటినుండి ఒక్క సంవత్సరం కాలం పప్పు ఉప్పు వదిలి వేస్తున్నాను. నీవు మానినా సరే మానకపోయినా సరే నీ ఇష్టం. నేను మాత్రం వదిలివేస్తున్నాను అని అన్నాను. కస్తూరి బాయి గిలగిలలాడిపోయింది. “నన్ను క్షమించండి. మీ స్వభావం తెలిసి కూడా మామూలుగా అనేశాను. మీ మాట ప్రకారం నేను పప్పు ఉప్పు మానివేస్తాను. మీరు మాత్రం మానకండి నాకు పెద్ద శిక్ష పడుతుంది” అని అంటూ బ్రతిమలాడింది. “నీవు పప్పు ఉప్పు మానితే మంచిదే. దానివల్ల నీకు లాభం కలుగుతుందనే నమ్మకం నాకున్నది. కాని చేసిన ప్రతిజ్ఞను విరమించుకోవడం నా వల్ల కానిపని. ఆ విధంగా వాటిని మానడం వల్ల నాకు లాభం కలుగుతుంది. అందువల్ల ఒత్తిడి చేయవద్దు. నాకు కూడా పరీక్ష జరగాలికదా! నేను మానడం వల్ల నీ వ్రతానికి బలం చేకూరుతుంది.” అని ఆమెకు చెప్పాను. ఇక ఏం చేస్తుంది? “మీరు జగమొండి. ఎవ్వరి మాటా వినరు?” అంటూ కాసేపు కన్నీరు కార్చి తరువాత శాంతించింది.

దీన్ని నేను సత్యాగ్రహం అని అంటాను. నా జీవనపు కొన్ని మధురక్షణాల్లో ఇది కూడా ఒకటి అని భావిస్తున్నాను.

తరువాత కస్తూరిబాయి ఆరోగ్యం త్వరత్వరగా కుదుటపడసాగింది. పప్పు ఉప్పు రెండూ మానడం ఆమె జబ్బు నయం కావడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు లేక ఆ రెండూ మానడం వల్ల ఆహారంలో జరిగిన తదితర మార్పులు కారణం అయివుండవచ్చు లేక ఇటువంటి మార్పు చేయించటానికి నేను చూపిన జాగరూకత, తత్ఫలితంగా మానసికంగా వచ్చిన మార్పు కూడా కారణం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా చిక్కిపోయిన కస్తూరిబాయి శరీరం తిరిగి పుంజుకోసాగింది. దానితో వైద్యరాజ్‌గా నా పరపతి కూడా బాగా పెరిగిపోయింది. ఉప్పు, పప్పు రెండిటినీ త్యజించడం వల్ల నామీద మంచి ప్రభావం పడింది. వదలివేసిన తరువాత పప్పు, ఉప్పు తినాలనే కోరిక కూడా ఎన్నడూ కలగలేదు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇంద్రియాలు శాంతించినట్లు నాకు అనుభూతి కలిగింది. సంయమం వైపుకు మనస్సు పరుగెత్తసాగింది. ఏడాది గడిచిన తరువాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. హిందూ