పుట:సత్యశోధన.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

హృదయ మధనం

వ్రతాన్ని పాటిస్తానని నిర్ణయించుకున్నాను. అయితే ఈ వ్రత శక్తి, ఆచరణలో కలిగే కష్టాలు పూర్తిగా నా దృష్టికి రాలేదు. అందలి ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. బ్రహ్మచర్యవ్రతం యొక్క గొప్పతనం తరువాత బోధపడసాగింది. బ్రహ్మచర్య వ్రత రహిత జీవనం శుష్కమైనదిగాను, పశుజీవనం వలె నాకు కనబడసాగింది. సహజంగా పశుపు నిరంకుశమైనది. మనిషి యందలి మానవత్వం అంకుశానికి లోబడి ఉండటం చూస్తున్నాం. ధార్మిక గ్రంథాల్లో బ్రహ్మచర్యాన్ని గురించి వ్రాయబడిన రాతలు అతిశయోక్తులు అని అనిపించేవి. కాని ఆ వ్రతాన్ని ఆచరణలో పెట్టిన తరువాత బ్రహ్మచర్యం శక్తి ఎంత మహత్తరమైనదో బోధపడింది. ఆ రాతలు అతిశయోక్తులు కావని అనుభవం పొంది రాసినవని గ్రహించాను.

జీవనంలో ఎంతో మార్పుతేగల బ్రహ్మచర్యవ్రతానుష్ఠానం అంత సులభమైనది కాదు. ఇది కేవలం శరీరానికి సంబంధించినదికాదు. శరీరాన్ని అంకుశంలో వుంచడంతో బ్రహ్మచర్యం ప్రారంభం అవుతుంది. శుద్ధ బ్రహ్మచర్యపాలన యందు యోచనా సరళి నిర్మలంగా ఉండాలి. పూర్ణ బ్రహ్మచారి మనస్సునందు కలలో సైతం వికారాలు కలుగకూడదు. కలల్లో వికారాలకు సంబంధించిన యోచనలు వస్తూ ఉంటే బ్రహ్మచర్యం అపూర్ణమని భావించాలి.

నాకు బ్రహ్మచర్య వ్రతం అవలంబించినప్పుడు శారీరక సంబంధమైన ఇబ్బందులు బాగా కలిగాయి. ఇప్పుడు ఆ మహాకష్టాలు పూర్తిగా తొలగిపోయాయని గట్టిగా చెప్పగలను. కాని యోచనలమీద అవసరమైనంత విజయం లభించలేదు. ప్రయత్నంలో లోటు చేయలేదు. కాని ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. యోచనలు వచ్చి బుర్రలో జొరబడతాయి. వాటి రాకను గురించి ఈనాటి వరకు తెలుసుకోలేకపోయాను. యోచనల్ని ఆపివేయగల తాళంచెవి మనిషి దగ్గర ఉంటుంది. ఈ విషయమై నాకు సందేహం లేదు. అయితే ప్రతి వ్యక్తి ఈ తాళం చెవి తనదగ్గరే వెతుక్కోవలసి ఉంటుందని ఈనాడు చెప్పగలను. మహాపురుషులు తెలిపిన అనుభవాలు మనకు మార్గం చూపుతాయి. అవి సంపూర్ణం కావు. సంపూర్ణత్వం కేవలం ప్రభువు ప్రసాదంవల్లే లభిస్తుంది. అందువల్లే భక్తులు తమ తపశ్చర్యల ద్వారా పునీతము, పావనకరము అయిన రామనామాది మంత్రాలు మనకు అందించి వెళ్ళారు. పూర్తిగా ఈశ్వరార్పణ కానిదే యోచనలమీద విజయం లభించదు. ధర్మ గ్రంథాలన్నింటి యందు ఇట్టి వచనాలు నేను చదివాను. వాటి యందలి సత్యం ఈ బ్రహ్మచర్యానుష్టాన మందలి సూక్ష్మపాలనా ప్రయత్నాల యందు నాకు గోచరిస్తుంది. నా ఈ మహాప్రయత్నానికి