పుట:సత్యశోధన.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

ఇంట్లో పెద్ద మార్పులు - పిల్లలకు శిక్షణ

కూడా ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవాడు. అతడు చేసే పనికి పిల్లలు బాగా సహకరించేవారు. పాయిఖానా ఎత్తుకు పోయేందుకు మునిసిపాలిటీ వాళ్ళు వస్తూ ఉండేవారు. కాని పాయిఖానా గది శుభ్రం చేయడం, కూర్చునే స్థానాలు కడగడం మొదలుగాగల పనులు నౌకరు చేత చేయించేవారం కాదు. నౌకరు ఆ పని చేయాలని ఆశించడం కూడా సరికాదని మా అభిప్రాయం. ఆ పని మేము స్వయంగా చేస్తూ ఉండేవారం. మా పిల్లలకు కూడా అట్టి శిక్షణ లభిస్తూ ఉండేది. అందువల్ల మా పుత్రులందరు మొదటి నుండి పాయిఖానా ఎత్తివేయాలన్నా, పాయిఖానా దొడ్డి బాగు చేయాలన్నా అసహ్యించుకోలేదు. సాధారణమైన ఆరోగ్య నియమాలు వారు తేలికగా తెలుసుకున్నారు. జోహంసుబర్గులో మా అబ్బాయిలెవ్వరూ జబ్బు పడలేదు. సేవా కార్యక్రమాల్లో సంతోషంతో పాల్గొంటూ ఉండేవారు.

వారి అక్షరజ్ఞానం విషయమై నేను నిర్లక్ష్యంగా వ్యవహరించానని అనను, కాని దాన్ని హోమం చేయడానికి నేను వెనుకాడలేదు. నా యీ పొరపాటును గురించి నన్ను మాట అనడానికి మా అబ్బాయిలకు అవకాశం ఉన్నదని చెప్పగలను. వాళ్ళు అనేక పర్యాయాలు తమ అసంతృప్తిని వెల్లడించారు కూడా. ఈ వ్యవహారంలో కొంత దోషం నాదేనని ఒప్పుకోక తప్పదు. వాళ్ళకు అక్షర జ్ఞానం కలిగించాలనే కోరిక మిక్కుటంగా నాకు ఉండేది. అందుకు కృషి కూడా చేశాను. కాని ఆ పనికి ఎప్పుడూ ఆటంకాలు కలుగుతూ ఉండేవి. ఇంటి దగ్గర విద్యాభ్యాసానికి మరో ఏర్పాటు చేయలేదు. అందువల్ల వాళ్ళను నా వెంట ఆఫీసుకు తీసుకువెళుతూ ఉండేవాణ్ణి. ఆఫీసు రెండున్నర మైళ్ళ దూరాన ఉండేది. ప్రతిరోజూ రానుపోను ఉదయం సాయంత్రం కలిపి వాళ్ళకు నాకు అయిదు మైళ్ళ నడక కసరత్తుగా సాగుతూ ఉండేది. నడుస్తున్నప్పుడు త్రోవలో పాఠం చెబుదామని ప్రయత్నం చేసేవాణ్ణి. నా వెంట మరొకరెవ్వరూ లేనప్పుడు అది సాగేది. ఆఫీసులో కక్షిదారులతోను, గుమాస్తాలతోను నాకు సరిపోయేది. ఆ సమయంలో ఏదో ఒకటి వ్రాయమనో, చదవమనో వాళ్ళకు పని అప్పగిస్తూ ఉండేవాణ్ణి. ఆ కాసేపు చదివి తిరుగుతూ, ఇంటికి సామాన్లు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్లు. పెద్దవాడు హరిలాలు మినహా మిగతా పిల్లల చదువు ఇలాగే సాగేది. హరిలాలు దేశంలో ఉండిపోయాడు. మా పిల్లల చదువుకై ప్రతిరోజూ ఒక గంటసేపైనా నేను సమయం కేటాయించి ఉంటే వాళ్ళకు ఆదర్శ విద్య గరిపి ఉండేవాడినే. ఆ పట్టుదల నేను చూపలేదు. అందుకు నాకు, వాళ్ళకు విచారం కలిగింది. మా పెద్ద కుమారుడు నాకు వ్యతిరేకంగా మారాడు. అందువల్ల తన అభిప్రాయం వెల్లడించాడు. జనం మధ్యన