పుట:సత్యశోధన.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

283

నేను తెల్లవాళ్ళ పెళ్ళిళ్ళు చేయించినట్లే హిందూ దేశపు పురుషుల్ని కూడా పెళ్ళాం బిడ్డల్ని పిలిపించమని ప్రోత్సహించాను. దానితో ఫినిక్సు చిన్న ఊరుగా మారింది. అక్కడ అయిదారు హిందీ కుటుంబాలవారు కూడా స్థిరపడి అభివృద్ధికి రాసాగారు.

23. ఇంట్లో పెద్దమార్పులు - పిల్లలకు శిక్షణ

డర్బనులో వుంటున్నప్పుడు ఇంట్లో మార్పులు చేశాను. ఖర్చు విపరీతం అయినా నిరాడంబరంగా వుండాలని ప్రయత్నం చేశాను. జోహన్సుబర్గులో సర్వోదయ భావాలు నాచేత ఎక్కువ మార్పులు చేయించాయి.

బారిష్టరు ఇల్లు సాధ్యమైనంత నిరాడంబరంగా వుండాలని కృషి ప్రారంభించాను. కాని కొంత గృహాలంకరణ అవసరమనిపించింది. మనస్సులో మాత్రం నిరాడంబరత్వం మొదలైంది. ప్రతి పని స్వయంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇందు పిల్లలను కూడా చేర్చుకున్నాను.

బజారు నుండి రొట్టె కొని తేవడం మానివేశాము. ఇంట్లో కూనే సూచించిన ప్రకారం రొట్టె స్వయంగా తయారు చేసుకోవడం ప్రారంభించాము. మిల్లులో తయారైన పిండి వాడకం తగ్గిపోయింది. మిల్లులో పట్టిన పిండి కంటే చేతితో విసిరిన పిండిని ఉపయోగిస్తే ఆరోగ్యరీత్యాను, నిరాడంబరత్వరీత్యాను మంచిదని, డబ్బు కూడా మిగులుతుందని తేలింది. అందుకోసం ఆరు పౌండ్లు పెట్టి తిరగలి కొన్నాం. తిరగలి రాళ్ళు పెద్దవిగా వున్నాయి. ఇద్దరు మనుష్యులు ఆ తిరగలితో తేలికగా పిండి విసరవచ్చు. ఒక మనిషి తిరగలి విసరడం కష్టం. ఈ తిరగలితో నేను, పోలక్ మరియు మా అబ్బాయిలు పిండి విసిరే వాళ్ళం. అప్పుడప్పుడు కస్తూరిబాయి కూడా విసిరేది. అయితే ఆమెకు భోజనం తయారు చేసేపని అప్పగించాం. పోలక్ భార్య వచ్చిన తరువాత ఆమె కూడా సహకరించింది. ఆ కసరత్తు పిల్లలకు ఎంతో ప్రయోజనకారి అయింది. నేను బలవంతంగా వాళ్ళ చేత ఆ పని చేయించలేదు. వాళ్ళే ఆటగా భావించి తిరగలితో పిండి విసరడం ప్రారంభించారు. అలసిపోతే మానవచ్చునని వారికి అనుమతి ఇచ్చాం. కాని మా పిల్లలు ఇంకా చాలా మంది ఇట్టి పనులు బాగా ఉత్సాహంతో చేశారు. వాళ్ళను గురించిన వివరం ముందు ముందు వ్రాస్తాను. కొంతమంది ఇతర పిల్లలు కూడా పని చేయసాగారు. అయితే వాళ్ళంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తుండేవారు. అలిసిపోయాం అని చెప్పిన పిల్లలు బహు తక్కువగా వుండేవారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక నౌకరు ఉండేవారు. అతడు