పుట:సత్యశోధన.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

279

వ్యవస్థలో పాలుపంచుకోవచ్చా” అని గద్గద కంఠంతో అడిగాడు. “తప్పక పాలుపంచుకోవచ్చు. అంతేకాదు మీరు అందులో చేరాలి” అని అన్నాను. “చేర్చుకుంటానంటే సిద్ధంగా ఉన్నాను.” అని అన్నాడు. ఆయన నిర్ణయానికి సంతోషించాను. ‘క్రిటిక్’ పత్రిక నుండి తప్పుకుంటున్నానని ఒక నెల రోజుల ముందే నోటీసు పత్రికాధిపతికి పంపి, నెలరోజుల వ్యవధి గడచిపోగానే ఫినిక్సు చేరుకున్నాడు. తన సహృదయతతో అందరినీ ఆకట్టుకున్నాడు. వారందరికీ తల్లో నాలుక అయిపోయాడు. నిరాడంబరతకు ఆయన ప్రతిమూర్తి. అందువల్ల ఫినిక్సు జీవనం ఆయనకు ఎబ్బెట్టు అనిపించలేదు. ఆయన స్వభావానికి అది సరిపోయింది.

కాని నేను ఆయనను అక్కడ ఎక్కువ రోజులు ఉండనీయలేకపోయాను మి. రీచ్ లా చదువు ఇంగ్లాండులో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నందున, ఆఫీసు పని నేను ఒక్కణ్ణి సంబాళించలేకపోయాను. అందువల్ల పోలక్‌ను ఆఫీసులో చేరమని, వకీలు వృత్తి చేపట్టమని ప్రోత్సహించాను. ఆయన వకీలు అయితే చివరకు అంతా వదిలివేసి ఇద్దరు ఫినిక్సు వెళ్ళవచ్చునని భావించాను.

ఆ తరువాత నా కలలన్నీ కల్లలేనని తేలిపోయింది. పోలక్‌లో ఒక గొప్ప సుగుణం వున్నది. ఎవరిమీదనైనా నమ్మకం కుదిరితే మారు మాట్లాడకుండా చెప్పినట్లు చేయడం తన కర్తవ్యంగా భావించే వ్యక్తి. నా జాబుకు సమాధానం వ్రాస్తూ “నాకు ఇక్కడి జీవనం హాయిగా వున్నది. ఇక్కడ సుఖంగా ఉన్నాను. ఈ సంస్థను ఇంకా అభివృద్ధికి తీసుకురావచ్చు. అయినా నేను అక్కడకు రావడం అవసరమని మన ఆదర్శాలు త్వరగా నెరవేరతాయని మీరు భావిస్తే నేను వస్తాను” అని వ్రాశాడు. నేను ఆ జాబుకు స్వాగతం పలికాను. పోలక్ ఫినిక్సు వదిలి జోహన్సుబర్గు వచ్చేశాడు. నా ఆఫీసులో సహాయకుడిగా చేరి వకీలు వృత్తి ప్రారంభించాడు.

ఇంతలో ఒక స్కాచ్ థియోసాఫిస్టు వచ్చాడు. పోలక్‌ను అనుసరించమని ఆయనను ప్రోత్సహించాను. ఇంతకు పూర్వం ఆయనకు లా చదువు విషయంలో సాయం చేస్తూ వుండేవాణ్ణి. ఆయన పేరు మేకిస్‌టయర్.

ఈ విధంగా ఫినిక్సు ఆదర్శాలను వెంటనే ఆచరణలో పెట్టాలనే భావంతో, వాటికి విరుద్ధమైన జీవితపు లోతుల్లోకి ప్రవేశిస్తున్నట్లు నాకు అనిపించింది. భగవదేచ్ఛ మరోరకంగా వుండియుండకపోతే నిరాడంబర జీవనం అనే నెపంతో పరుచుకున్న మోహజాలంలో స్వయంగా చిక్కుకుపోయేవాణ్ణి. ఎవ్వరూ ఊహించని రీతిలో నేను, నా ఆదర్శాలు ఎలా రక్షింపబడ్డాయో రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను.