పుట:సత్యశోధన.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

277

వాళ్ళు చక్రం త్రిప్పసాగారు. పని అయిపోతూ ఉన్నది. తెల్లవారింది. ఏడో గంట కొట్టారు. ఇంకా పని మిగిలి ఉండటం గమనించాను. వెస్ట్‌వైపు చూచి ఏమండీ ఇంజనీరును మేల్కొలపకూడదా? పగటిపూట బాగు చేస్తే ఇంజను నడుస్తుందేమో, పని సమయానికి పూర్తి అవుతుంది కదా! అని అన్నాను.

వెస్ట్ వెంటనే వెళ్ళి ఇంజనీరును మేల్కొలిపాడు. అతడు ఇంజను వున్న చోటకు వెళ్ళాడు. మీట నొక్కేసరికి ఇంజను పనిచేయడం ప్రారంభించింది. ప్రెస్సు అంతా సంతోషపు నినాదాలతో మార్మోగింది. “ఏమిటిది? ఇంజను రాత్రి నడవనంది కదా! మరి ఇప్పుడు మీటనొక్కగానే ఏమీ తెలియనట్లు ఠపీమని ఎలా నడిచింది?” ఈ ప్రశ్నలకు వెస్ట్, ఇంజనీరు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. “ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. మిషన్లకు కూడా మన మాదిరిగా విశ్రాంతి అవసరం అయివుండవచ్చు. అప్పుడప్పుడు అవి ఇలా వ్యవహరిస్తూ వుండటం కద్దు” అని అన్నారు.

“ఇంజను మనందరికీ మంచి పరీక్ష పెట్టింది. మనమంతా కష్టపడ్డాం సమయానికి అది నడవడం మన నిజమైన శ్రమకు శుభప్రదమైన ఫలితం అయివుండవచ్చు” అని అన్నాను. సమయానికి పత్రిక స్టేషను చేరుకుంది. అంతా నిశ్చింతగా శ్వాస పీల్చారు. పత్రిక సమయానికి వెలువడుతుందనే భావం జనానికి కలిగింది. ఫినిక్సులో కాయకష్టం చేయాలనే వాతావరణం నెలకొన్నది. ఒక పర్యాయం ఇంజనును నడపడం మాని, చక్రం త్రిప్పి ముద్రణా కార్యక్రమం సాగించిన రోజులు కూడా వున్నాయి. అవి నైతికంగా ఫినిక్సు చరిత్రలో ఉన్నతమైన రోజులని నా అభిప్రాయం.

21. పోలక్

ఫినిక్సు వంటి సంస్థ స్థాపించబడిన తరువాత నేను అక్కడ కొద్ది రోజులు మాత్రమే వుండగలిగాను. అందుకు ఎంతో విచారపడ్డాను. దాన్ని స్థాపించినప్పుడు నేను కూడా అక్కడే ఉండాలని, అక్కడే జీవితం గడపాలని నెమ్మదిగా వకీలు వృత్తి మానివేయాలని, ఫినిక్సు విజయాన్ని నిజమైన సేవగా భావించాలని అనుకున్నాను. కాని అనుకున్నట్లుగా పనులు జరగలేదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి అను విషయాన్ని జీవితంలో అనుభవం వల్ల తెలుసుకున్నాను. దానితోబాటు సత్యశోధన ఉపాసన సాగినప్పుడు, మనం కోరుకున్న ఫలితం కలుగక, ఊహించని ఫలితం కలిగితే దానివల్ల నష్టం కలుగదని, ఒక్కొక్కప్పుడు మనం ఊహించిన దానికంటే మించిన