పుట:సత్యశోధన.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

275

నా వెంట మా బంధువులు చాలా మంది దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటున్నారు. వారిని అంగీకరింపచేసి ఫినిక్సులో చేరుద్దామని ప్రయత్నం చేశాను. డబ్బు సంపాదించుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వారికి నచ్చచెప్పడం కష్టం. కొద్దిమంది మాత్రమే నా మాటల్ని అర్థం చేసుకున్నారు. అట్టివారిలో మగన్‌లాల్ గాంధీ పేరు ఎన్నిక చేసి మరీ పేర్కొంటున్నాను. నా మాటలు అర్థం చేసుకున్న వారిలో కొంతమంది కొద్దిరోజులు ఫినిక్సులో వుండి తరువాత డబ్బు సంపాదనలో పడిపోయాడు. కాని మగన్‌లాల్ గాంధీ మాత్రం అలా చేయలేదు. తన వ్యాపారం మానుకొని నా వెంట రావడమే గాక చివరవరకూ నాతోబాటు వుండిపోయాడు. తన బుద్ధిబలం, త్యాగనిరతి, అపరిమితమైన భక్తి భావంతో నేను ప్రారంభించిన శోధనా కార్యక్రమాలన్నింటిలో అండగా నిలబడి పనిచేశాడు. నా అనుచరుల్లో ఇప్పుడు మొదటిస్థానంలో మగన్‌లాల్ వున్నాడు. సుశిక్షుతుడైన పనివాడుగా సాటిలేని మేటిగా నా దృష్టిలో ఆదరం పొందాడు.

ఈ విధంగా 1904 లో ఫినిక్సు స్థాపన జరిగింది. ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కోవలసివచ్చినా తట్టుకొని ఫినిక్సు సంస్థ, ఇండియన్ ఒపీనియన్ పత్రిక రెండూ ఇప్పటికీ జీవించి వున్నాయి. అయితే ఈ సంస్థను ప్రారంభించినప్పుడు మేము పొందిన సాఫల్యాలు, వైఫల్యాలు తెలుసుకోతగినవి. వాటిని గురించి మరో ప్రకరణంలో వ్రాస్తాను.

20. మొదటి రాత్రి

ఫినిక్సులో ఇండియన్ ఒపీనియన్ పత్రిక ప్రథమ ప్రతిని వెలువరించడం కష్టమైంది. రెండు జాగ్రత్తలు పడియుండకపోతే ఒక వారం సంచిక వెలువడియుండేది కాదు లేక ఆలస్యంగా వెలువడియుండేది. ఈ సంస్థలో ఇంజను సాయంతో నడిచే మిషన్లు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు. వ్యవసాయం చేతులతో చేస్తున్నప్పుడు ముద్రణా కార్యక్రమం కూడా చేతులతో నడిచే మిషన్లతో సాగించడం మంచిదని భావించాను. అయితే అది కష్టమని ఆ తరువాత తెలిసింది. దానితో అక్కడికి ఆయిలు ఇంజను తీసుకువెళ్ళాం. ఈ ఆయిలు ఇంజను దగా చేస్తే ముద్రణ సాగించేందుకు మరో పరికరం సిద్ధం చేసి వుంచుకోవడం అవసరమని వెస్ట్‌కు చెప్పాను. అతడు చేతితో త్రిప్పితే తిరిగే చక్రం ఒకటి సిద్ధం చేశాడు. దానితో ముద్రణ యంత్రం నడిచే ఏర్పాటు చేశాడు. మా పత్రిక దినపత్రిక ఆకారంలో ఉన్నది. పెద్దమిషను పాడైతే వెంటనే దాన్ని