పుట:సత్యశోధన.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

ఫినిక్సు స్థాపన

అయితే బాల్యం నుండి అతడు నేను చెప్పిన ప్రకారం శిక్షణ పొందడానికి, నేను చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మీద అతడికి అపరిమితమైన విశ్వాసం. మారు మాటాడకుండా మేము చెప్పిన ప్రకారం చేయడానికి అంగీకరించాడు. ఇప్పటివరకూ నా దగ్గరే ఉన్నాడు.

గోవిందసామి అని మెషిన్‌మెన్ వున్నాడు. అతడు కూడా సంస్థలో చేరిపోయాడు. మిగతావాళ్ళు సంస్థలో చేరేందుకు అంగీకరించలేదు. కాని ప్రెస్సును ఎక్కడికి తీసుకువెళితే అక్కడకు రావడానికి సిద్ధపడ్డారు.

ఈ విధంగా కార్యకర్తలతో మాట్లాడేందుకు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం పట్టలేదని గుర్తు. వెంటనే నేను డర్బనుకు సమీపంలో స్టేషను దగ్గరగా భూమి కావాలని పత్రికల్లో ప్రకటన చేశాను. ఫినిక్స్ యందలి చోటు వున్నది ఇస్తామని సమాధానం వచ్చింది. నేను, వెస్ట్ ఇద్దరం ఆ చోటు చూచేందుకు వెళ్ళాం. ఏడు రోజుల్లోపల 20 ఎకరాలు భూమి కొన్నాం. అందు ఒక చిన్ని నీటి కాలువ ఉన్నది. నారింజ చెట్లు, మామిడిచెట్లు కూడా ఉన్నాయి. దాని ప్రక్కన మరో 80 ఎకరాల భూమి కూడా ఉన్నది. అందు పండ్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక కుటీరం కూడా ఉన్నది. దాన్ని కూడా కొద్ది రోజుల తరువాత కొనివేశాం. రెండిటికీ కలిపి 10 వేల పౌండ్లు ఇచ్చాం.

సేఠ్ పారసీరుస్తుంగారు నేను పూనుకొనే సాహసోపేతమైన కార్యక్రమాలన్నింటికీ అండగా వుండేవారు. నా ప్రణాళిక వారికి నచ్చింది. ఒక పెద్ద గొడౌనుకు చెందిన టిన్ను రేకులు మొదలుగాగలవి వారి దగ్గరపడి ఉన్నాయి. వాటినన్నింటినీ ఉచితంగా మాకు ఇచ్చివేశారు. వాటితో గృహ నిర్మాణం ప్రారంభించాం. కొంతమంది హిందూ దేశానికి సంబంధించిన వడ్రంగులు, తాపీవాళ్ళు దొరికారు. వారిలో చాలామంది యుద్ధరంగంలో నాతోబాటు పనిచేసినవారే. వారి సాయంతో కార్ఖానా నిర్మాణం ప్రారంభమైంది. ఒక మాసం రోజుల్లో 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుగల ఇంటి నిర్మాణం పూర్తి అయింది. వెస్ట్ మొదలగు వారు ప్రాణాలకు తెగించి వడ్రంగులు తాపీవాళ్ళతో బాటు పనిచేశారు. ఫినక్సులో గడ్డి ఎక్కువగా ఉంది. అక్కడ జనసంఖ్య బహు తక్కువ. పాములు మాత్రం ఎక్కువ. ఇదే అక్కడ ప్రమాదం. ప్రారంభంలో అంతా డేరాలు వేసుకొని వున్నారు. ఇంటి యందలి ముఖ్యభాగం తయారవగానే ఎద్దుల బండ్లలో సామాను అక్కడికి చేర్చాం. డర్బనుకు, ఫినిక్సు పదమూడు మైళ్ళ దూరాన ఉన్నది. స్టేషనుకు మా భూమి రెండున్నర మైళ్ళ దూరాన ఉన్నది. ఒక్క వారం మాత్రమే ఇండియన్ ఒపీనియన్ పత్రికను మర్క్యురీ ప్రెస్సులో ముద్రించవలసి వచ్చింది.