పుట:సత్యశోధన.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

ఒక పుస్తకపు అద్భుత ప్రభావం

కూడా త్వరగా నమ్మి పనిచేసే నా స్వభావాన్ని పూర్తిగా మార్చుకోజాలనందుకు విచారపడ్డాను. ఇందుకు కారణం శక్తి సామర్థ్యం కంటే మించి పని చేద్దామనే లోభమే. ఈ లోభం వల్ల నేను కష్టపడవలసి వచ్చింది. అంతేగాక నా సహచరులు ఎంతో ఇబ్బందులకు లోనుకావలసి వచ్చింది.

వెస్ట్ వ్రాసిన జాబు చూచి నేను నేటాలుకు బయలుదేరాను. పోలక్ నా విషయాలన్నీ గ్రహించాడు. నన్ను సాగనంపుటకు స్టేషనుకు వచ్చాడు. ఒక పుస్తకం నాకిచ్చి “ఈ పుస్తకం చదువతగింది. చదవండి. మీకు నచ్చుతుంది” అని అన్నాడు. పుస్తకం పేరు “అంటు దిస్ లాస్ట్” రస్కిన్ రాసిన పుస్తకం. ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను. చివరివరకు దాన్ని వదలలేకపోయాను. నన్ను ఆ పుస్తకం ఆకట్టివేసింది. జోహన్సుబర్గు నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం. సాయంత్రం రైలు డర్బను చేరుకుంది. స్థావరం చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. పుస్తకంలో చదివిన విషయాల్ని ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను.

ఇంతకు ముందు రస్కిన్ పుస్తకాలు ఏవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. కర్మభూమి మీద అడుగు పెట్టిన తరువాత సమయం చిక్కలేదు. అందువల్ల ఈనాటి వరకు నాకుగల పుస్తక జ్ఞానం తక్కువేనని చెప్పక తప్పదు. అయాచితంగా తప్పనిసరి అయి ఏర్పడిన ఈ సంయమం వల్ల నష్టం కలగలేదని చెప్పలేను. కాని చదివిన కొద్ది పుస్తకాలను ఒంట పట్టించుకున్నానని మాత్రం చెప్పగలను. నా జీవితంలో చదివిన తక్షణం మహత్తరమైన నిర్మాణాత్మక మైన మార్పు తెచ్చిన పుస్తకం ఇదేనని మాత్రం చెప్పగలను. తరువాత దాన్ని నేను అనువదించాను. సర్వోదయం అను పేరట ఆ పుస్తకం అచ్చు అయింది.

నాలో లోతుగా పాతుకుపోయిన విషయాల ప్రతిబింబం స్పష్టంగా రస్కిన్ రచించిన ఈ గ్రంథరత్నంలో నాకు కనబడింది. అందువల్ల ఈ పుస్తక ప్రభావం నా హృదయం మీద అపరిమితంగా పడింది. ఆ పుస్తకమందలి విషయాల్ని ఆచరణలో పెట్టాలని ప్రేరణ కలిగింది. మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను మేల్కొలపగల శక్తి కలవాడే కవి. కవుల ప్రభావం సర్వుల మీద పడదు. సర్వులలో మంచి భావాలు సమాన పరిమాణంలో వుండకపోవడమే అందుకు కారణం. నేను తెలుసుకున్న సర్వోదయ సిద్ధాంతాలు ఇవి.