పుట:సత్యశోధన.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

271

పెరగడమే గాక వారి యెడ నా నైతిక బాధ్యత కూడా బాగా పెరిగింది. మాంసరహిత భోజనశాలలో వెస్ట్‌దొరతో నాకు పరిచయం అయినట్లే పోలక్‌తో కూడా పరిచయం అయింది. ఒకరోజు నేను బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాను. దూరంగా వున్న ఒక బల్ల దగ్గర కూర్చొని ఒక యువకుడు భోజనం చేస్తున్నాడు. “మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నాను, అనుమతి ఇస్తారా” అని చీటీ వ్రాసి పంపించాడు. ఆయనను నా బల్లదగ్గరకు రమ్మన్నాను. ఆయన వచ్చాడు.

“నేను క్రిటిక్ అను పత్రికకు ఉపసంపాదకుణ్ణి. ప్లేగును గురించి మీరు ప్రకటించిన జాబు చదివాను. అప్పటి నుండి మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నాను. నా ఆ కోరిక ఈనాడు నెరవేరింది.” అని అన్నాడు.

మి. పోలక్ యొక్క నిష్కపట భావాలవల్ల నేను ఆయన యెడ ఆకర్షితుడనయ్యాను. ఆ రాత్రి మేమిద్దరం ఒకరికొకరం బాగా పరిచితులమయ్యాం. మా జీవిత విధానాల్లో సామ్యం కనబడింది. సాదా జీవనం వారికి ఇష్టం. బుద్ధి అంగీకరించిన విషయాల్ని వెంటనే అమలు పరచాలన్న తపన ఆయనలో అధికంగా కనబడింది. తన జీవనంలో చాలా మార్పులు వెంటనే చేసిన వ్యక్తి మి. పోలక్.

“ఇండియన్ ఒపీనియన్” ఖర్చు పెరిగిపోతున్నది. వెస్ట్ పంపిన మొదటి రిపోర్టు చదివి నివ్వెరపోయాను. “మీరు చెప్పినంత లాభం యిక్కడ కనబడలేదు. నష్టం కనబడుతున్న లెక్కలు కూడా అస్తవ్యస్తంగా వున్నాయి. పని అయితే బాగానే వున్నది. కాని దానికి తలా తోకా కనబడటం లేదు. మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఈ రిపోర్టు చూచి గాబరా పడకండి. నాకు చేతనైనంత వరకు వ్యవస్థను సరిచేస్తాను. లాభం లేదని నేను పని మానను” అని జాబు వ్రాశాడు.

లాభం లేనందున వెస్ట్ తలుచుకుంటే పని మానివేసేవాడే. ఆయనను తప్పు పట్టడానికి కూడా వీలులేదు. సరియైన వివరాలు తెలుసుకోకుండా లాభం వస్తున్నదని చెప్పినందుకు నన్ను తప్పు పట్టవచ్చు కూడా. అయినా ఆయన నన్ను ఎన్నడూ ఒక కటువైన మాటకూడా అనలేదు. చెప్పుడు మాటలు నమ్మేవాడినని నన్ను గురించి వెస్ట్ భావించి వుంటాడని అనుకున్నాను. మదనజీత్ మాట ప్రకారం నేను లాభం వస్తున్నదని వెస్ట్‌కు చెప్పాను. సార్వజనిక పనులు చేసేవారు స్వయంగా పరిశీలించి చూడనిదే ఒకరిని నమ్మి వెంటనే నిర్ణయానికి రాకూడదని పాఠం నేర్చుకున్నాను. సత్యపూజారి ఇంకా జాగ్రత్తగా వుండాలి. పూర్తిగా నిర్ణయానికి రానిదే ఏదో మాట చెప్పి ఒకరి మనస్సును నమ్మేలా చేయడం సత్యాన్ని మరుగుపరచడమే. ఈ విషయం తెలిసియుండి