పుట:సత్యశోధన.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

మహమ్మారి - 2

వచ్చేవాణ్ణి. భోజనశాల యజమాని నన్ను బాగా ఎరుగును. ఆయనకు ముందుగానే నేను ప్లేగు సోకిన రోగుల సేవ చేస్తున్నాను, నా వల్ల ఎవ్వరికీ ఏ విధమైన యిబ్బంది కలుగకూడదు అని చెప్పాను. అందువల్ల నేను భోజనశాలలో వెస్ట్‌గారికి కనబడలేదు. రెండోరోజునో లేక మూడో రోజునో ఉదయం పూట నేను బయటకు వెళ్ళబోతున్నప్పుడు నేనుండే గది దగ్గరికి వచ్చి తలుపుకొట్టగా నేను తలుపు తెరిచాను. నన్ను చూచీ చూడగానే “మీరు భోజనశాలలో కనబడనందున మీకేమైనా అయిందేమోనని గాబరాపడ్డాను. ఈ సమయంలో తప్పక దొరుకుతారనే భావంతో వచ్చాను. అవసరమైతే చెప్పండి. రోగులకు సేవ శుశ్రూషలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నా పొట్ట నింపుకోవడం మినహా నాకు మరో బాధ్యత అంటూ ఏమీ లేదని మీకు తెలుసుగదా అని అన్నాడు.

నేను వెస్ట్‌గారికి ధన్యవాదాలు సమర్పించాను. నేను ఆలోచించేందుకు ఒక్క నిమిషం సేపు కూడా వృధా చేయలేదు. “మిమ్మల్ని నర్సుగా తీసుకోను. మేము జబ్బు పడకపోతే రెండుమూడు రోజుల్లో మా పని పూర్తి అవుతుంది. ఒక్క పని మాత్రం ఉన్నది” అని అన్నాను. “ఏమిటది” “దర్బను వెళ్ళి ఇండియన్ ఒపీనియన్ ప్రెస్సుపని మీ చేతుల్లోకి తీసుకోగలరా? మదనజీత్ ప్రస్తుతం ఇక్కడ పనిలో మునిగి ఉన్నాడు. అక్కడికి ఎవరైనా వెళ్ళడం అవసరం. మీరు వెళితే ఆ చింత నాకు తొలగుతుంది“ “నా దగ్గర ప్రెస్సు వున్నదని మీకు తెలుసు. ఏ సంగతీ సాయంకాలం చెబుతా. సరేనా! సాయంత్రం వాహ్యాళికి వెళదాం మాట్లాడుకోవచ్చు” నాకు ఆనందం కలిగింది. ఆ రోజు సాయంత్రం మాట్లాడాం. ప్రతిమాసం వెస్ట్‌కు పది పౌండ్ల జీతం మరియు ప్రెస్సులో డబ్బు మిగిలితే దానిలో భాగం ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి వెస్ట్‌దొర జీతానికి ఒప్పుకునే వ్యక్తికాదు. అందువల్ల జీతాన్ని గురించి ఆయన పట్టించుకోలేదు. రెండో రోజు రాత్రి మెయిలుకి వెస్ట్ బయలుదేరి వెళ్ళాడు.

అప్పటినుండి నేను దక్షిణ ఆఫ్రికా వదిలి వచ్చేవరకు కష్టసుఖాల్లో నాతోబాటు వుండి ఆయన పనిచేశాడు. వెస్ట్‌దొర ఇంగ్లాండులో లౌథ్ అను గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. స్కూల్లో సామాన్య శిక్షణ పొంది, కష్టపడి పైకి వచ్చి అనుభవం అనే పాఠశాలలో శిక్షణ పొందినవాడు. పొందికగల సంయమశీలి, భగవంతునికి భయపడేమనిషి, ధైర్యశాలి, పరోపకారి. ఆయనను గురించి, ఆయన కుటుంబాన్ని గురించి రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను.