పుట:సత్యశోధన.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

మహమ్మారి - 2

పత్యపానాలు చూడాలి. వారు దొడ్డికి వెళితే ఆ మలం ఎత్తివేయాలి. ఇంతకంటే మించి పని లేదు. నలుగురు యువకులు నడుం వంచి చేసిన శ్రమ, వారి నిర్భీకత చూచి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

డాక్టరు గాడ్‌ఫ్రే, మదన్‌జీత్‌ల ధైర్యం మాట సరే. ఈ నలుగురు యువకుల ధైర్యం అద్భుతం. ఏదో విధంగా ఆ రాత్రి గడిచింది. నాకు జ్ఞాపకం వున్నంతవరకు ఆ రాత్రి మేము ఒక్క రోగిని కూడా పోగొట్టుకోలేదు. కాని ఈ ఘట్టం ఎంత కరుణరసార్ద్రమైనదో, అంత మనోరంజకమైనది. నా దృష్టిలో ఇది ధార్మికమైనది కూడా.

16. మహమ్మారి - 2

ముందుగా అనుమతి తీసుకోకుండా ఇంటి తాళం బద్దలు కొట్టి అందు రోగులను చేర్చి వారికి సేవా శుశ్రూష చేసినందుకు టౌన్‌క్లర్కు మమ్మల్ని అభినందించాడు. “ఇటువంటి సమయంలో ధైర్యం చేసి మీరు చేసిన విధంగా ఏర్పాటు చేసే చొరవ మాకు లేదు. మీకు ఏవిధమైన సాయం కావలసివచ్చినా చెప్పండి. టౌన్‌కౌన్సిలు చేతనైన సాయం చేస్తుంది.” అని మనస్పూర్తిగా చెప్పాడు. మున్సిపాలిటీ వారు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. రోగుల సేవ విషయంలో వాళ్ళు ఆలస్యం చేయలేదు.

రెండో రోజున ఖాళీగా వున్న పెద్ద గోడౌను మాకు అప్పగించారు. అందు రోగులనందరినీ చేర్చమని చెప్పారు. దాన్ని శుభ్రం చేసే బాధ్యత మునిసిపాలిటీ వహించలేదు. ఆ గోడౌను మురికిగాను, అపరిశుభ్రంగాను ఉంది. మేమంతా కలిసి దాన్ని శుభ్రం చేశాము. ఉదార హృదయులగు భారతీయులు మంచాలు వగైరా ఇచ్చారు. అక్కడ ఒక ఆసుపత్రి వాతావరణం ఏర్పడింది. మునిసిపాలిటీ వారు ఒక నర్సును పరిచారికను పంపించారు. బ్రాందీ సీసాలు, మందులు వగైరా వారికిచ్చి పంపారు. డాక్టర్ గాడ్‌ఫ్రే మొదటివలెనే మాతోబాటు వుండి చికిత్స చేస్తున్నారు. నర్సును, మేము రోగుల దగ్గరికి పోనీయలేదు. ఆమెకు ఏమీ ఇబ్బంది కలుగలేదు. ఆమె స్వభావం మంచిది. అయితే ఎవ్వరికీ ప్రమాదం కలుగకూడదని మా అభిప్రాయం. రోగులకు బ్రాందీ పట్టమని సలహా ఇచ్చింది. వ్యాధి సోకకుండా మీరు కూడా కొద్ది కొద్దిగా బ్రాందీ తాగమని నర్సు మాకు సలహా ఇచ్చింది. ఆమె బ్రాందీ త్రాగుతునే వున్నది. రోగులకు బ్రాందీ పట్టడానికి నా మనస్సు అంగీకరించలేదు. ముగ్గురు రోగులు బ్రాందీ త్రాగకుండా వుండటానికి అంగీకరించారు. డా. గాడ్‌ఫ్రే గారి