పుట:సత్యశోధన.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

265

ఆ రోగుల్ని చూచాడు. ఆయన గుండె దడదడలాడింది. పెన్సిలుతో వ్రాసి ఒక చీటీ నా దగ్గరికి పంపించాడు. అందులో ఇలా వ్రాశాడు. “ఇక్కడ హఠాత్తుగా నల్లప్లేగు అంటుకుంది. మీరు వెంటనే వచ్చి ఏమైనా చేయాలి. లేకపోతే భయంకరమైన పరిణామం ఏర్పడుతుంది. త్వరగా రండి” మదనజీత్ ఒక ఖాళీగా ఉన్న ఇంటిని నిర్భయంగా ఆక్రమించి ఆ రోగుల్ని అందులో చేర్చాడు. సైకిలుమీద నేను వెంటనే లొకేషను చేరాను. అక్కడినుండి టౌన్‌క్లర్కుకు జాబు పంపి ఏ పరిస్థితుల్లో ఆ గృహాన్ని ఉపయోగించవలసి వచ్చిందో వ్రాశాను.

డాక్టర్ విలియం గాడ్‌ఫ్రే జోహన్సుబర్గులో డాక్టరుగా వున్నారు. సమాచారం అందగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు. రోగులకు తానే డాక్టరు, నర్సు అయిపోయాడు. కాని 23 మంది రోగులకు మేము ముగ్గురం ఏం సరిపోతాం? ఇలాంటి సమయంలో మన విధానం సరిగా ఉంటే కష్టాల్ని ఎదుర్కొనేందుకు సేవకులు తప్పక లభించి తీరతారని అనుభవం మీద తెలుసుకున్నాను. నా ఆఫీసులో కళ్యాణదాసు, మాణిక్‌లాల్ మరియు మరో ఇద్దరు హిందూ దేశస్థులు వున్నారు. చివరి ఇద్దరి పేర్లు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేవు. కళ్యాణదాసును అతని తండ్రి నాకు అప్పగించాడు. అతని వంటి పరోపకారి కేవలం ఆజ్ఞను పాటించునట్టి వారు బహు కొద్దిమందే ఉంటారు. అదృష్టవశాత్తు కళ్యాణదాసు బ్రహ్మచారి. ఎంతటి ప్రమాదకరమైన పని అయినా అతనికి అప్పగించే స్థితిలో నేను ఉన్నాను. రెండో సజ్జనుడు మాణిక్‌లాల్. అతడు నాకు జోహాన్సుబర్గులో లభించాడు. అతడికి కూడా పెండ్లి కాలేదనే అనుకుంటాను. నాకు గుమస్తాలు, అనుచరులు, బిడ్డలు అన్నీవారే. ఆ నలుగురినీ హోమం చేసేందుకు సిద్ధపడ్డాను. కళ్యాణదాసును అడగనక్కరలేదు. మిగతావారు అడగగానే సిద్ధపడ్డారు. “ఎక్కడ మీరు వుంటే అక్కడ మేము ఉంటాం” ఇది వారు క్లుప్తంగా ఇచ్చిన సమాధానం.

మి. రీచ్ కుటుంబం పెద్దది. ఆయన స్వయంగా రావడానికి సిద్ధపడ్డాడు. కాని నేనే వారిని ఆపాను. వారిని ఈ ప్రమాదంలోకి నెట్టడానికి నేను సిద్ధం కాలేదు. నాకు ధైర్యం చాలలేదు. అయితే ఆయన బయటి కార్యమంతా చేసేందుకు నడుం బిగించాడు. ఆ రాత్రి సేవా శుశ్రూషల్లో గడిచింది. అది నిజంగా కాళరాత్రే. నేను చాలా మంది రోగులకు శుశ్రూష చేశాను. కాని ప్లేగు వాతపడిన రోగులకు శుశ్రూష నేనెన్నడూ చేసి యుండలేదు. డాక్టర్ గాడ్‌ఫ్రే ప్రదర్శించిన ధైర్యం మమ్మల్ని నిర్భయుల్ని చేసింది. రోగులకు సేవ ఎక్కువ చేయనక్కరలేదు. వాళ్ళకు మందు ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి