పుట:సత్యశోధన.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

264

మహమ్మారి - 1

అన్నా అని అంగీకరించేది ఎవరు? అందువల్ల ఆయన ఎంతో ప్రీతికరమైన పదం ఒకటి వెతికి బయటికి తీశారు. భాయీ అంటే సోదరా అనేదే ఆ పదం. ఆ పదం దక్షిణ ఆఫ్రికాలో చివరిదాకా నాకు స్థిరపడిపోయింది. గిరిమిట్ ప్రధమం నుండి విముక్తులైన హిందూ దేశస్థులు నన్ను “భాయీ” అని పిలుస్తున్నప్పుడు వారి పిలుపులో నాకు తీయదనం గోచరిస్తూ వుండేది.

15. మహమ్మారి - 1

మునిసిపాలిటీ వారు ఈ లొకేషను యాజమాన్యం పట్టా పుచ్చుకొని అక్కడ వుండే హిందూదేశస్థుల్ని వెంటనే తొలగించలేదు. వారికి అనుకూలమైన మరో చోటు చూపించాలి. వారు స్థలం నిర్ణయించనందున వెళ్ళమని చెప్పలేదు. తత్ఫలితంగా హిందూ దేశస్తులు ఆ ‘మురికి’ లొకేషన్‌లోనే వున్నారు. కాని రెండు మార్పులు జరిగాయి. హిందూ దేశస్థులు గృహయజమానులుగా వుండక, మునిసిపాలిటీ వారికి బాడుగ చెల్లించేవారుగా మారారు. దానితో లొకేషనులో మురికి బాగా పెరిగిపోయింది. మొదట హిందూ దేశస్థులకు యాజమాన్యం హక్కు లభించియున్నప్పుడు, ఇష్టం వున్నా లేకపోయినా భయం వల్ల పరిసరాలను కొద్దిగా శుభ్రంగా ఉంచుకొనేవారు. ఇప్పుడు మునిసిపాలిటీ వ్యవహారం కదా! ఎవరికీ ఎవరన్నా ఏమీ భయం లేదు. ఇండ్లలో కిరాయిదారులు పెరిగిపోయారు. వారితోపాటు మురికి, అవ్యవస్థ పెరిగి పోయింది.

ఇలా వ్యవహారం నడువసాగింది. ఇది చూచి హిందూ దేశస్థులకు భయం పట్టుకుంది. ఇంతలో భయంకరంగా ప్లేగు అంటుకుంది. అది ప్రాణాంతకమైన మహమ్మారి. ఊపిరితిత్తులకు సంబందించిన ప్లేగు, నల్ల ప్లేగుకంటే ఇది ప్రమాదకరమైంది. అదృష్టవశాత్తు మహమ్మారికి కారణం లొకేషను కాదని అందుకు కారణం జోహన్సుబర్గు సమీపంలోనున్న బంగారుగనుల్లో గల ఒక గని అని తేలింది. అక్కడ హబ్షీ శ్రామికులు ఉన్నారు. అక్కడి పారిశుధ్య బాధ్యత తెల్ల యజమానులది. ఈ గనిలో కొందరు హిందూ దేశస్థులు కూడా పనిచేస్తున్నారు. వారిలో 23 మందికి అంటురోగం సోకింది. ఒకనాటి సాయంత్రం భయంకరమైన ప్లేగు రోగంతో వారంతా లొకేషనులోగల తమ చోటుకు చేరుకున్నారు.

అప్పుడే భాయిమదనజీత్ ఇండియన్ పత్రికకు చందాదారుల్ని చేర్చడానికి చందాలు వసూలు చేయడానికి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆయన భయపడలేదు.