పుట:సత్యశోధన.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

కూలి లొకేషనా లేక పాకీ వాళ్ల పల్లెయా?

“కూలీ” అని పేరు. కూలీ అనే పదం మన దేశంలో కూలీ నాలీ చేసుకొనేవారికే వర్తిస్తుంది. కాని దక్షిణ ఆఫ్రికాలో యీ పదం పాకీలు, మాదిగలు మొదలుగాగల వారి కందరికి తిరస్కార సూచకంగా వాడతారు. దక్షిణ ఆఫ్రికాలో యిట్టి కూలీలందరి కోసం కేటాయించబడ్డ చోటును కూలీ లొకేషన్ అని అంటారు. అలాంటి లొకేషన్ ఒకటి జోహాన్సుబర్గులో వున్నది. ఆ లొకేషన్‌లో గాని, యితర చోట్ల అదే విధంగా వున్న కూలీ లొకేషన్లలో గాని నివసిస్తున్న హిందూదేశస్థులకు అక్కడ యాజమాన్యం హక్కు లేదు. జోహాన్సుబర్గులో గల ఈ లొకేషన్‌కు మాత్రం 99 సంవత్సరాల పట్టా యివ్వబడింది. యిందు హిందూ దేశస్థులు కిటకటలాడుతూ వుండేవారు. జనసంఖ్య పెరిగిపోసాగిందేకాని లొకేషన్ విస్తీర్ణం మాత్రం పెరగలేదు. పాయిఖానా దొడ్లు శుభ్రం చేయించడందప్ప అంతకుమించి మునిసిపాలిటీ వాళ్ళ లొకేషనును గురించి పట్టించుకోలేదు. అక్కడ రోడ్లమీద దీపాలు ఎందుకు వుంటాయి? అసలు పాయిఖానా పరిశుభ్రతను గురించి కూడా ఏ మాత్రం పట్టించుకోని ఆ లోకేషన్‌లో యితర పారిశుధ్యాల్ని గురించి అడిగేనాధుడెవరు? అక్కడ నివసిస్తున్న హిందూ దేశస్తులు పట్టణ పారిశుధ్యం ఆరోగ్యం మొదలుగాగల వాటిని గురించి వాటి నియమాలను గురించి తెలిసిన ఆదర్శ భారతీయులు కారు. మునిసిపాలిటీ వారికి సాయం చేయాలని గాని, తమ నడవడిక, ప్రవర్తనను గురించి పట్టించుకోవడం అవసరం అని గాని భావించేవారు కాదు.

సూక్ష్మంలో మోక్షం చూపించగల, మట్టి నుంచి తిండి గింజల్ని పండించగల హిందూ దేశస్థులు అక్కడికి వెళ్ళి స్థిరపడివుంటే అక్కడి చరిత్ర మరో విధంగా మారి వుండేది. అసలు ప్రపంచంలో ఎక్కడా యీ విధంగా వేలాది, లక్షలాది మంది జనం యితర దేశాలకు వెళ్ళి స్థిరపడలేదు. సామాన్యంగా జనం డబ్బు కోసం, వృత్తి కోసం విదేశాలలో కష్టాలు పడుతూ వుంటారు. హిందూదేశంలో అధిక శాతం మంది నిరక్షర కుక్షులు, దీనులు, దుఃఖితులు, శ్రామికులు. వాళ్ళే ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అడుగడుగునా వారికి రక్షణ అవసరం. వారి తరువాత అక్కడకు వెళ్ళిన వ్యాపారస్తులు, తదితర స్వతంత్ర భారతీయులు సంఖ్యలో బహుకొద్దిమందే వున్నారు.

ఈ విధంగా పారిశుధ్య కార్యక్రమాల్ని నిర్వహించవలసిన శాఖవారి క్షమించరాని నిర్లక్ష్యంవల్ల ప్రవాస భారతీయుల అజ్ఞానం వల్ల ఆరోగ్యదృష్ట్యా లొకేషస్ స్థితి నాసి అయిపోయింది. దాన్ని బాగుచేయడానికి మునిసిపాలిటీవాళ్ళు సరికాదా పై పెచ్చు యీ వంకమీద ఆ లొకేషనునంతా దగ్ధం చేసివేయాలని నిర్ణయించారు. అక్కడి భూమిని ఆధీనం చేసుకునే హక్కును కౌన్సిలు నుండి సంపాదించుకున్నారు. ఇదీ నేను జోహన్సుబర్గు చేరుకున్నప్పటి పరిస్థితి.