పుట:సత్యశోధన.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

257

కోరింది. కన్యాదానం చేసే గౌరవం కూడా నాకే లభించింది. మిస్‌డిక్ మిస్ మెకడనల్డ్ అయింది. అప్పుడు ఆమెకు మేము దూరం కావలసి వచ్చింది. వివాహం అయిన తరువాత కూడా పని ఎక్కువైనప్పుడు కబురు చేస్తే ఆమె వచ్చి సహకరిస్తూ ఉండేది.

ఆఫీసులో షార్టుహాండు తెలిసినవారు కావలసి వచ్చింది. ఒక మహిళ దొరికింది. ఆమె పేరు శ్లేశిన్. ఆమెను నాదగ్గరకు మి.కేలన్‌బక్ తీసుకువచ్చారు. శ్రీ కేలన్‌బక్ గారిని గురించి పాఠకులు ఇక ముందు తెలుసుకుంటారు. ఆ మహిళ ఒక హైస్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు 17 సంవత్సరాల వయస్సు. ఆమె ప్రత్యేకతలు కొన్ని చూచి నేను, మి.కేలన్‌బక్ ఆశ్చర్యపడేవాళ్ళం. ఆమె నౌకరీ చేయాలనే ఉద్దేశ్యంతో మా దగ్గరకు రాలేదు. ఆమె అనుభవం కోసం వచ్చిందన్నమాట. ఆమెకు వర్ణద్వేషం లేదు. ఆమె ఎవ్వరినీ లక్ష్యపెట్టేది కాదు. ఎవరినైనా సరే అవమానించడానికి సంకోచించేదికాదు. ఒకరిని గురించి ఆమెకు కలిగిన భావాన్ని స్పష్టంగా ప్రకటించేది. తన భావాన్ని వెల్లడించడానికి వెనుకాడేదికాదు. ఇట్టి స్వభావం వల్ల అప్పుడప్పుడు అందరికీ బరువు దిగినట్లుండేది. ఆమెకు ఇంగ్లీషు భాషమీదగల అధికారం నాకంటే అధికం. ఈ కారణాలన్నిటివల్ల ఆమె తయారు చేసిన జాబులను తిరిగి చదవకుండా సంతకం పెడుతూ వుండేవాణ్ణి.

ఆమెకు గల త్యాగ ప్రవృత్తి ఎంతో గొప్పది. ఆమె చాలా కాలం వరకు నా దగ్గర కేవలం ఆరు పౌండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండేది. అంతకంటే జీతం తీసుకునేందుకు చివరి వరకు ఆమె అంగీకరించలేదు. జీతం ఎక్కువ తీసుకోమని నేను అంటే ఆమె నన్ను బెదిరిస్తూ “జీతం తీసుకునేందుకు నేను ఇక్కడ వుండటం లేదు. మీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం. మీ ఆదర్శాలంటే నాకు ఇష్టం. అందుకే మీ దగ్గర పనిచేస్తున్నాను” అని స్పష్టంగా అంటూ ఉండేది.

ఒకసారి అవసరంపడి నా దగ్గర ఆమె 40 పౌండ్లు తీసుకున్నది. అది కూడా అప్పుగానే. గత సంవత్సరం ఆమె ఆ డబ్బంతా తిరిగి ఇచ్చివేసింది. ఆమె త్యాగభావం ఎంత తీవ్రంగా వుండేదో ధైర్యం కూడా అంత ఎక్కువగా ఉండేది. స్పటికమణి వంటి పవిత్రత, క్షత్రియుల్ని కూడా నివ్వెరపడేలా చేయగల ప్రతాపం కలిగిన కొందరు మహిళామణులు నాకు తెలుసు. అట్టివారిలో ఈమె ఒకరని నా అభిప్రాయం. ఆమె వయస్సులో ఉన్న ప్రౌఢ అవివాహిత. ఇప్పుడు ఆమె మానసికస్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు. అయినా నాకు కలిగిన అనుభవం వల్ల ఆమెను ఈనాటికి పవిత్రంగా స్మరిస్తాను. తెలిసిన సత్యాన్ని వ్రాయకపోతే సత్యానికి ద్రోహం చేసినవాణ్ణి అవుతానుకదా!