పుట:సత్యశోధన.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

255

ఏర్పరుచుకున్నప్పుడు, అలా చేస్తూ రాగద్వేషాలకు దూరంగా వుండగలిగినప్పుడు శక్తిని వికసింపచేసుకోగలుగుతాము.

బోయర్లకు బ్రిటీష్‌వారికి యుద్ధం ప్రారంభమైనప్పుడు నా ఇల్లు పూర్తిగా నిండిపోయి వున్నప్పటికీ జోహన్సుబర్గు నుండి వచ్చిన ఇద్దరు ఇంగ్లీషు వారికి నా ఇంట్లో బస ఏర్పాటు చేశాను. ఇద్దరూ థియాసాఫిస్టులు. ఒకని పేరు కిచన్. ఆయనను గురించి ముందు కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ మిత్రుల సహవాసం కూడా నా ధర్మపత్నిని బాగా ఏడిపించింది. నా మూలాన ఆమె ఏడ్వవలసిన సందర్భాలు అనేకసార్లు ఏర్పడ్డాయి. ఏవిధమైన పర్దాగాని, అరమరికలు గాని లేకుండా ఇంగ్లీషువారికి బస ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది క్రొత్త అనుభవం. ఇంగ్లాండులో నేను వాళ్ళ ఇళ్ళలో వున్నమాట నిజం. అయితే వారి విధానానికి, ప్రవర్తనకు లోబడి నేను వున్నాను. ఆ నా నివాసం హోటలు నివాసం వంటిది. కాని ఈ వ్యవహారం అలాంటిది కాదు. పూర్తిగా అందుకు విరుద్ధం. ఈ మిత్రులు నా కుటుంబసభ్యులుగా వున్నారు. వాళ్ళు భారతీయ అలవాట్లను, నడవడిని అనుసరించారు. ఇంట్లోను, బయటకూడా వ్యవహారమంతా ఆంగ్లేయుల పద్ధతిలోనే ఉన్నాయి. ఈ మిత్రుల్ని మాతోబాటు మా ఇంట్లో వుంచినప్పుడు ఎన్నో ఇబ్బందులు కలిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. కాని వారిద్దరు మా కుటుంబ సభ్యులందరితో పూర్తిగా కలిసిపోయారని చెప్పగలను. జోహన్సుబర్గులో ఈ సంబంధాలు డర్బనును మించిపోయాయి.

12. ఇంగ్లీషువారితో పరిచయం

ఒక పర్యాయం జోహన్సుబర్గులో నా దగ్గర నలుగురు హిందూ దేశపు గుమాస్తాలు ఉండేవారు. వారిని గుమాస్తాలు అనాలో లేక బిడ్డలు అని అనాలో చెప్పలేను. వారితో నా పనిసాగలేదు. టైపు లేనిదే నా పని సాగదు. టైపింగు జ్ఞానం కొద్దో గొప్పో నా ఒక్కడికే ఉంది. ఈ నలుగురు యువకుల్లో యిద్దరికి టైపింగు చేయడం నేర్పాను. కాని వాళ్ళకు ఇంగ్లీషు బాగా రాకపోవడం వల్ల వారిటైపు బాగుండలేదు. వారిలో లెక్కలు వ్రాయగలవారిని కూడా తయారు చేసుకోవాలి. నేటాలు నుండి నా ఇష్టమైన వాళ్ళను పిలిపించుకునేందుకు వీలులేదు. పర్మిట్ లేకుండా ఏ హిందూ దేశస్థుడూ ప్రవేశించడానికి వీలులేదు. నా సౌకర్యం కోసం అధికారుల మెహర్బానీ కోసం బిచ్చం అడిగేందుకు నేను సిద్ధపడలేదు. నేను ఇబ్బందుల్లో పడ్డాను. ఎంత శ్రమపడ్డా, వకీలువృత్తి, సార్వజనిక సేవాకార్యం రెండూ సాగించడం కష్టమైపోయింది.