పుట:సత్యశోధన.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

బలవంతులతో పోరు

తేలిక అయిన పోషక పదార్థం మరొకటి లేదు. అందువల్ల పుస్తకంలో పాలను గురించి నేను వ్రాసిన మార్గాన నడుస్తామని పట్టుపట్టవద్దని పాఠకులకు మనవి చేస్తున్నాను.

ఈ ప్రకరణం చదివిన వైద్యులు, డాక్టర్లు, హకీములు, అనుభవజ్ఞులు తదితరులెవరైనా సరే పాలకు బదులుగా పోషక పదార్థం మరియు తేలికగా జీర్ణం కాగలిగిన వనస్పతి ఏదైనా ఉంటే చదివిన పుస్తకాల ఆధారంతోగాక, ఆచరించి పొందిన అనుభవంతో ఆ వివరం తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను.

9. బలవంతులతో పోరు

ఇక ఆసియా విభాగపు అధికారుల వైపు మళ్ళుదాం. ఆ ఆసియా విభాగపు బహుదొడ్డ కార్యాలయం జోహన్సుబర్గులో వుంది. అక్కడ హిందూ దేశస్థులతో బాటు, చైనీయులు మొదలుగాగల వారి రక్షణకు బదులు భక్షణ జరుగుతున్నది. నా దగ్గరికి రోజూ అందుకు సంబంధించి పితూరీలు వస్తూ ఉండేవి. అధికారుల దయవల్ల నిజమైన హక్కుదారులు దక్షిణ ఆఫ్రికా రాలేకపోతున్నారు. కాని హక్కులేని వాళ్ళు వంద వంద పౌండ్లు లంచం ఇచ్చి వస్తున్నారనీ, ఇందుకు తగిన చికిత్స మీరు చేయకపోతే ఇక చేసేదెవరు? అని నా దగ్గర ఒకటే గొడవ. అది నిజమని నాకు అనిపించింది. ఈ దుర్గంధాన్ని పూర్తిగా తొలగించివేయకపోతే ట్రాన్సువాలులో నా నివాసం వ్యర్థం అన్నమాట.

ప్రమాణాలు సేకరించడం ప్రారంభించాను. నా దగ్గర చాలా గట్టి ప్రమాణాలు చేరిన తరువాత నేను తిన్నగా పోలీసు కమీషనరు దగ్గరికి వెళ్ళాను. అతడు దయాగుణం, న్యాయప్రవృత్తి కలవాడని నాకు అనిపించింది. నా మాటలు అసలు విననని భీష్మించకుండా, ఓపికతో నా మాటలు ఆయన విన్నాడు. ప్రమాణాలు చూపించమని అన్నాడు. సాక్షుల సాక్ష్యాలు ఆయన స్వయంగా సేకరించాడు. అతనికి నమ్మకం కలిగింది. అయితే నాకు తెలిసినట్లుగానే దక్షిణ ఆఫ్రికాలో తెల్ల న్యాయనిర్ణేతల ఎదుట తెల్ల దోషులకు శిక్ష పడేలా చూడటం కష్టమని ఆయనకూ తెలుసు. “అయినా ప్రయత్నిద్దాం. అసలు న్యాయనిర్ణేతలు ఇట్టి దోషుల్ని వదిలివేస్తారని భావించి ఆ భయంతో వాళ్ళను పట్టించుకోకపోవడం కూడా సరికాదు. అందువల్ల నేను వాళ్ళను పట్టిస్తాను. అందుకు అవసరమైన శ్రమపడతానని మీరు నమ్మవచ్చు” అని ఆయన అన్నాడు.