పుట:సత్యశోధన.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

247

పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకున్నాను. చరకుని శ్లోకాలు వినిపించి వైద్యులు కొందరు రోగం నయం కావడానికి ఖాద్యాఖాద్యములను గురించి బాధపడవద్దని మాంసాదులు కూడా తినవచ్చునని చెప్పారు. ఈ వైద్యులు పాలు త్రాగకుండా గట్టిగా వుండమని చెప్పలేరని తేలిపోయింది. బీఫ్ టీ (గోమాంసపు టీ), బ్రాంది పుచ్చుకోవచ్చునని చెప్పేవారున్న చోట పాలు త్రాగడం మానమని చెప్పేవారు ఎలా దొరుకుతారు? ఆవుపాలు, గేదెపాలు నేను త్రాగను. అది నా వ్రతం. నా వ్రత ఉద్దేశ్యం పాలు మానడమే. అయితే అట్టి వ్రతం గైకొన్నప్పుడు నా దృష్టిలో వున్నది గోమాత, గేదెమాత మాత్రమే. నేను వ్రతం అనే పదాన్ని పాటించాను. మేకపాలు తీసుకొనేందుకు అంగీకరించాను. మేకమాత పాలు త్రాగుతున్నప్పుడు వ్రతాత్మకు విఘాతం కలిగిందని నాకు అనిపించింది.

అయితే నేను రౌలట్ ఆక్టును ఎదుర్కోవాలి! ఆ మోహం నన్ను వదలలేదు. అందువల్ల జీవించి వుండాలనే కాంక్ష కలిగింది. జీవితంలో మహత్తర ప్రయోగమని దేన్ని భావిస్తూ వున్నానో అది ఆగిపోయింది.

ఆహారంతో జలంతో ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ తినదు, తాగదు. ఉదరంలోకి పోయే పదార్థాలతో దానికి సంబంధం లేదు. లోనుండి వెలువడే మాటలే లాభనష్టాలు కలిగిస్తాయని నాకు తెలుసు. అందు నిజం కూడా కొంత వున్నది. తర్కం జోలికి పోకుండా ఇక్కడ నా దృఢ నిశ్చయం ప్రకటిస్తున్నాను. భగవంతునికి వెరచి నడుచుకోవాలని, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని భావించే సాధకునకు మరియు ముముక్షువునకు ఆహారపదార్థాల ఎన్నికను గురించి, వాటిని త్యజించడాన్ని గురించి శ్రద్ధ చాలా అవసరం. భావాన్ని, వాక్కును ఎన్నుకోవడం ఎంత అవసరమో నిర్ణయం యెడ శ్రద్ధ వహించడం అంత అవసరం అన్నమాట.

అయితే స్వయంగా నేను చేయని దాన్ని ఆచరించమని ఎవ్వరికీ సలహా ఇవ్వను. అలా ఎవరైనా చేయదలుచుకుంటే వారిని వారిస్తాను. అందువల్ల ఆరోగ్యవిషయమై నేను వ్రాసిన పుస్తకం సాయంతో ప్రయోగాలు చేయదలచిన చాలామందిని హెచ్చరిస్తున్నాను. పాలు మానడం పూర్తిగా లాభకారి. అయితే, అనుభవజ్ఞులగు వైద్యులు డాక్టర్లు పాలుమానమని సలహాయిస్తేనే పాలుమానడం మంచిది. నా పుస్తకాన్ని ఆధారం చేసుకొని మాత్రం పాలు మానవద్దు. నాకు ఇప్పటివరకు కలిగిన అనుభవం వల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జీర్ణశక్తి మందగించిన వారికీ, జబ్బుతో పక్కమీద నుండి లేవలేనివారికి, పాలకంటే మించిన