పుట:సత్యశోధన.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

243

అతనికి అలవాటు. అతని మాటలు సబబుగా వున్నాయి. బద్రీ సొమ్ము తీర్చివేశాను. కాని మరో వంద పౌండ్లు నేను మునిగి వుంటే తట్టుకోగల శక్తి నాకు లేదు. అప్పు చేయవలసి వచ్చేది. జీవితంలో ఇట్టి పని ఇక ఎన్నడూ నేను చేయలేదు. ఇటువంటి పని నాకు అసలు గిట్టదు. సంస్కరణకు సంబంధించిన పనుల్లో కూడా శక్తికి మించి పాల్గొనడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం గీత బోధించిన తటస్థ నిష్కామకర్మ విధానానికి విరుద్ధమని, ఆ విధంగా గీతను తృణీకరించినట్లయిందని తెలుసుకున్నాను. మాంసరహిత ఆహార ప్రచారం కోసం ఈ విధమైన బలిదానం అవసరమవుతుందని కలలోనైనా ఊహించలేదు. ఇది బలవంతగా లభించిన పుణ్యమని భావించవచ్చు.

7. మట్టితో, నీటితో ప్రయోగాలు

నా జీవితంలో నిరాడంబరత పెరిగినకొద్దీ రోగాలకు మందు పుచ్చుకోవడమంటే అయిష్టత కూడా పెరిగింది. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నపుడు డాక్టర్ ప్రాణజీవనదాసు మెహతా నన్ను చూచేందుకు వచ్చేవారు. అప్పుడు నాకు నీరసంగా వుండేది. అప్పుడప్పుడు వాపు కూడా వస్తూ ఉండేది. ఆయన చికిత్స చేయగా ఆ నలత తగ్గిపోయింది. ఆ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేవరకు చెప్పుకోదగ్గ జబ్బు చేసినట్లు నాకు గుర్తు లేదు.

జోహన్సుబర్గులో నన్ను విరోచనాలు పట్టుకున్నాయి. తలనొప్పి కూడా వుండేది. విరోచనాలకు మందు పుచ్చుకుంటూ ఉండేవాణ్ణి. పత్యంగా వుండేవాణ్ణి. అయినా పూర్తిగా వ్యాధి తగ్గలేదు. విరోచనాలు కట్టుకుంటే బాగుంటుందని మనస్సు సదా కోరుకుంటూ ఉండేది.

ఇదే సమయాన నేను మాంచెస్టరు పత్రికలో “నో బ్రేక్‌ఫాస్టు అసోసియేషన్” (టిఫెన్ల త్యాగ సంఘం) స్థాపనకు సంబంధించిన వార్త చదివాను. ఆ వార్తా రచయిత ఇంగ్లీషు వాళ్ళు చాలాసార్లు చాలా ఆహారం భుజిస్తారనీ, రాత్రి పన్నెండు గంటలదాకా తింటూనే వుంటారనీ, తత్ఫలితంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వుంటారనీ, ఈ బాధ తొలగాలంటే ఉదయం తీసుకునే టిఫెను (బ్రేక్ ఫాస్టు) మానివేయాలని వ్రాశాడు. ఈ ఆరోపణ పూర్తిగా కాకపోయినా కొంతవరకు నాకూ వర్తిస్తుందని భావించాను. నేను మూడు పర్యాయాలు కడుపు నిండా తినేవాణ్ణి. మధ్యాహ్నం పూట టీ కూడా త్రాగేవాణ్ణి. శాకాహారం, మసాలాలు లేని ఆహార పదార్థాలు భుజించేవాణ్ణి. ఆరు లేక ఏడు