పుట:సత్యశోధన.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

237

ప్రారంభించినప్పుడు ఒక అమెరికాకు చెందిన భీమా ఏజంటు నన్ను కలుసుకునేందుకు వచ్చాడు. అతని ముఖం ఆకర్షణీయంగా వుంది. మాటలు మధురంగా వున్నాయి. మేము పాత మిత్రులమా అనే భావం కలిగేలా అతడు నా భావి జీవితహితానికి సంబంధించి మాట్లాడాడు. “అమెరికాలో మీ స్థాయిలో వుండే వ్యక్తులంతా తమ జీవితాన్ని భీమా చేస్తారు. మీరు కూడా చేయించుకొని మీ భవిష్యత్తుని గురించి నిశ్చింతపడండి. అది ఎంతో అవసరం. జీవితంలో స్థిరత్వం కోసం అమెరికాలో భీమా చేయించుకోవడం కర్తవ్యమని భావిస్తాం. ఒక చిన్న పాలసీ తీసుకునేందుకు నేను మిమ్ము ఒప్పించలేనా?” అని అన్నాడు.

దక్షిణ ఆఫ్రికాలోను, హిందూదేశంలోను, చాలామంది భీమా ఏజంట్లను త్రిప్పి పంపించివేశాను. భీమా చేయించడంలో కొంచెం పిరికితనం, ఈశ్వరునిపై అపనమ్మకం పనిచేస్తుందని నా అభిప్రాయం. కాని ఈ పర్యాయం నేను కొంచెం ఆకర్షితుడనయ్యాను. అతడి మాటలు వింటున్న కొద్దీ నా భార్యా బిడ్డల భవిష్యత్తును గురించిన చిత్తరువు కండ్ల ఎదుట కనబడసాగింది. “ఓ పెద్దమనిషీ! నీవు దరిదాపుగా నీ భార్య ఆభరణాలన్నీ అమ్మివేశావు. రేపు నీకేమైనా ఆయితే, భార్యాబిడ్డల భారం పాపం బీదవాడైన నీ అన్నగారి మీద పడుతుంది. ఆ సోదరుడే తండ్రిగా నీ బాధ్యత వహించాడు. ఆయన మీదే మొత్తం భారం పడదా! ఇది ఏమంత మంచిపని కాదు” ఈ రకమైన తర్కం నా మనస్సులో ప్రారంభమైంది. అప్పుడు 10వేల రూపాయలకు భీమా చేయించాను కాని దక్షిణ ఆఫ్రికాలో తలెత్తిన క్రొత్త ఆపదను పురస్కరించుకొని నేను చేసిన పనులన్నీ భగవంతుణ్ణి సాక్షిగా పెట్టుకొని చేసినవే. దక్షిణ ఆఫ్రికాలో ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. ఇక హిందూ దేశానికి తిరిగి వెళ్ళలేను. అందువల్ల నా భార్యాబిడ్డల్ని నా దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళను ఇక వదలకూడదు. వాళ్ళపోషణ దక్షిణ ఆఫ్రికాలోనే జరగాలి అని అనుకున్నాను. దానితో ఆ పాలసీ దుఃఖానికి హేతువు అయింది. భీమా ఏజంటు వలలో చిక్కుకున్నందుకు సిగ్గుపడ్డాను. మా అన్న తండ్రి బాధ్యత హించినప్పుడు, తమ్ముని భర్య వితంతువైతే ఆమె బాధ్యత వహించడని నీవు ఎట్లా అనుకున్నావు? నీవే ముందు చనిపోతావని ఎందుకు భావించావు? పాలకుడు ఆ ఈశ్వరుడే. నీవూ కాదు, నీ అన్నా కాదు. భీమా చేయించి భార్యాబిడ్డల్ని కూడా పరాధీనుల్ని చేశావు. వాళ్ళు స్వయం పోషకులు కాలేరా? ఎంతోమంది బీదల బిడ్డలు లేరా? వారి సంగతేమిటి? నీ వాళ్ళుకూడా అట్టివారేనని ఎందుకు భావించవు?