పుట:సత్యశోధన.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

233

చేతులు చల్లబడ్డాయి. అయితే ఆ విభాగం అధికారులు అంతటితో ఊరుకోలేదు. నేను ట్రాన్సువాలు చేరుకోగలిగాను కాని చేంబర్లేనును కలువకుండా చేయగల సత్తా వాళ్ళకు ఉంది.

అందుకే ముందుగానే పేర్లు అడిగారన్నమాట. దక్షిణాఫ్రికాలో వర్ణ ద్వేషం వల్ల కలిగే కటు అనుభవాలు అధికం. దానితోబాటు హిందూ దేశంలో వలె తారుమారు చేయడం, టక్కరితనం చేయడం వంటి దుర్వాసన ఇక్కడ కూడా మొదలైంది. దక్షిణాఫ్రికాలో ప్రభుత్వ శాఖలు ప్రజలహితం కోసం పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల అధికారులు వినమ్రంగాను, సరళంగాను వ్యవహరించే వారు. దాని ప్రయోజనం అప్పుడప్పుడు నల్ల తెల్ల పచ్చ చర్మాల వాళ్ళు కూడా సహజంగా పొందుతూ వుండేవారు. ఆసియా దేశపు వాతావరణం ఏర్పడేసరికి అక్కడి మాదిరిగానే కాళ్ళకు మొక్కుతా వంటి ప్రవృత్తి, అంతా తారుమారు చేసే పద్ధతి, తదితర చెడ్డ మురికి అలవాట్లు చోటు చేసుకున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒకరకమైన ప్రజాస్వామ్యం నడుస్తున్నది. కాని ఆసియా నుండి మాత్రం నవాబ్‌గిరీ వచ్చిపడింది. అక్కడ ప్రజాప్రభుత్వం లేకపోవడం, కేవలం ప్రజల మీద అధికారం చలాయించే ప్రభుత్వం మాత్రమే వుండటం అందుకు కారణం. దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు గృహాలు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళే అక్కడి ప్రజలన్నమాట. అందువల్ల అక్కడి అధికార్ల మీద వాళ్ల అంకుశం పని చేస్తున్నదన్నమాట. ఆసియా నుండి వచ్చిన నిరంకుశ అధికారులు కూడా వాళ్ళతో చేతులు కలిపి హిందూ దేశస్థుల్ని అడకత్తెర మధ్య ఇరుక్కున్న పోకచెక్కలా చేశారు.

నాకు కూడా ఇట్టి నవాబ్‌గిరీ ఎలా ఉంటుందో బోధపడింది. నన్ను మొదట ఈ విభాగం ప్రధాన అధికారి దగ్గరకు పిలిపించారు. ఈ ఆఫీసరు లంక నుండి వచ్చాడు. పిలిపించారనీ, పిలిపించబడ్డాననీ అనడం సబబు కాదు. కొంచెం వివరం తెలియజేస్తాను. నా దగ్గరికి లిఖితంగా ఏవిధమైన ఆర్డరు రాలేదు. కాని ముఖ్యులగు హిందూ దేశస్తులు అక్కడికి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి ముఖ్యుల్లో కీ.శే. సేఠ్ తయ్యబ్ హాజీ ఖాన్ మహ్మద్ కూడా ఒకరు. ఆయన్ని అధికారి “గాంధీ ఎవరు? అతడు ఎందుకోసం వచ్చాడు?” అని ప్రశ్నించాడు.

తయ్యబ్ సేఠ్ ‘ఆయన మాకు సలహాదారు. వారిని మేము పిలిపించాము’ అని చెప్పాడు. ‘అయితే మేమంతా ఇక్కడ ఎందుకున్నాం? మీ రక్షణ కోసం మేము ఇక్కడ నియమించబడలేదా? గాంధీకీ ఇక్కడి విషయం ఏం తెలుసు?’ అని గద్దించాడు.