పుట:సత్యశోధన.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

229

అయ్యాను. ఇంతలో హఠాత్తుగా దక్షిణ ఆఫ్రికా నుండి తంతి వచ్చింది. “చేంబర్లేనుగారు ఇచటికి రానున్నారు. నీవు వెంటనే రావాలి” ఇది ఆ తంతి సారం. నేను వారికి చెప్పిన మాటలు గుర్తున్నాయి. నేను మళ్ళీ తంతి పంపాను. “నా ఖర్చులు సిద్ధం చేయండి. బయలు దేరి వస్తాను” అని. వెంటనే డబ్బు వచ్చింది. అక్కడ ఒక ఏడాది పడుతుందని అనుకున్నాను. బంగళా నాక్రిందనే వుంచుకొని భార్యాబిడ్డల్ని అందు వుంచి వెళదామని నిర్ణయించుకున్నాను. ఈ దేశంలో పని దొరకని చిన్నవాళ్ళు, విదేశాలకు వెళ్ళేందుకు సాహసించడం మంచిదని అప్పుడు నాకు తోస్తూవుండేది. అందువల్ల నా వెంట నలుగురైదుగురిని తీసుకువెళ్లాను. వారిలో మగన్‌లాల్‌గాంధీ కూడా ఒకరు.

గాంధీ కుటుంబం పెద్దది. ఇంకను వృద్ధి అవుతూ ఉంది. వీరిలో స్వాతంత్ర్యం కోరేవారిని స్వతంత్రుల్ని చేయాలని నా భావన. మా తండ్రిగారు వారినందరినీ జమీందారీ నౌకరీలో బెట్టి ఏదో విధంగా పోషిస్తూ వుండేవారు. వాళ్ళు తమంతట తాము సంపాదించుకోగల స్వతంత్రులు కావాలని నా కోరిక. మగన్‌లాల్ గాంధీని సిద్ధం చేయగలిగాను. ఈ విషయం ముందు వివరిస్తాను.

భార్యాబిడ్డల వియోగం, స్థిరపడిన వకీలు పనిని త్రెంచి వేయడం, నిశ్చిత వస్తువు నుండి అనిశ్చిత వస్తువునందు ప్రవేశించడం, ఇదంతా ఒక నిమిషం పాటు బాధాకరం అనిపించింది. కాని నాకు అనిశ్చిత జీవనం అలవాటు అయిపోయింది. ఈ ప్రపంచంలో భగవంతుడొక్కడే సత్యం. మిగిలినదంతా అనిశ్చితం. మన చుట్టుప్రక్కల కనిపించేదీ జరిగేది అంతా అనిశ్చితం. క్షణికం. దీనియందు నిశ్చిత రూపమైన ఏ పరమతత్వం విలీనమై ఉన్నదో దాని ప్రదర్శనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం మీద నమ్మకం వుంచితే మన జీవనం సార్ధకం కాగలదు. ఈ అన్వేషణే పరమ పురుషార్థం అని అంటారు

నేను దర్బనుకు ఒకరోజు ముందుగా వెళ్ళలేకపోయాను. నేను చేయవలసిన పని అంతా తయారు చేసి ఉంచారు. చేంబర్లేనుగారిని చూచుటకు తేదీ నిర్ణయించబడింది. వారికి అందజేయవలసిన అర్జీ వ్రాసి నేను డిప్యుటేషనుతో వెళ్ళాలి.


* * *