పుట:సత్యశోధన.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

227

“ఆ నాయనా!”

“నన్ను బయటికి తీయండి. చచ్చిపోతున్నాను.”

“చెమట పోస్తున్నదా!”

“చెమటతో స్నానం చేశాను వెంటనే తీసివేయినాన్నా?”

నేను మణిలాలు తల తాకి చూచాను! చెమట చేతికి తగిలింది. జ్వరం దిగజారింది. ఈశ్వరునికి చేతులెత్తి నమస్కరించాను.

“నాయనా! మణిలాలూ! భయంలేదు. యిక జ్వరం పోతుంది. ఇంకొంచెం చెమట పోయనీయి”

“ఇక ఆగలేను. యిప్పుడే నన్ను బయటికి తీయండి. అవసరమైతే యింకోసారి కప్పవచ్చు”

నాకు ధైర్యం వచ్చింది. మాటల్లో కొద్ది నిమిషాలు గడిచాయి. చెమట ధారగా కారసాగింది. కప్పిన బట్టలన్నీ తొలగించాను. ఒళ్ళంతా తుడిచి ఆరనిచ్చాను. తరువాత తండ్రీ బిడ్డలం ఆ మంచం మీదనే నిద్రించాం. మా యిద్దరికీ గాఢంగా నిద్రపట్టింది. తెల్లవారింది. లేచి చూచాను. మణిలాలుకు వేడి చాలా వరకు తగ్గి పోయింది. నలభైరోజులు పాలు, నీళ్ళు, పండ్లు వీటితో నడిపాను. నాకు భయం పోయింది. జ్వరం మొండిదే కాని లొంగిపోయింది. నేడు నా పిల్లలందరిలో మణిలాలు ఆరోగ్యవంతుడు. బలిష్టుడు కూడా.

దీనికి కారణం? రాముడి కృపయా? జలచికిత్సయా? అల్పాహారమా? లేక ఏదేని ఉపాయమా? నిర్ణయం ఎవరు చేయగలరు? ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు భావించవచ్చును. కానీ ఆ సమయంలో ఈశ్వరుడే నా ప్రార్థనను ఆలకించాడని నా నమ్మకం. ఆనాటికీ, యీనాటికీ అదే నా నమ్మకం.

23. మళ్లీ దక్షిణ-ఆఫ్రికా

మణిలాలుకు పూర్తిగా నెమ్మదించింది. గిరిగాము నందలి గృహం వాసయోగ్యంగా లేదని అనుకున్నాను. ఇల్లంతా తేమ. తగిన వెలుగులేదు. అందువల్ల నేను రేవాశంకరుగారితో మాట్లాడి మంచి చోట గాలివచ్చే ఇల్లు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. బాంద్రా, శాంతాకృజ్ వగైరాలన్నీ తిరిగాము. బాంద్రాలో కసాయి దుకాణం వుండటం వల్ల అక్కడ నివసించడానికి నాకు బుద్ధి పుట్టలేదు. ఘల్‌కోపర్