పుట:సత్యశోధన.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

223

“ఎవిడెన్సు ఆక్టు విధానమంతా ఫిరోజ్‌గారికి కరతలామలకం. ఆయన గొప్పవాడు కావడానికి అదే కారణమని నా మిత్రులు, దక్షిణ ఆఫ్రికాకు వెళ్లక పూర్వం నాకు చెబుతూ వుండేవారు. ఈ సంగతి నేను గుర్తుంచుకొని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లేటప్పుడు టీకాలతో సహా దాన్ని బాగా పఠించాను. ఇంతేగాక నాకు దక్షిణ ఆఫ్రికాలో మంచి అనుభవం కలిగింది.

నేను దావా గెలిచాను. అందువల్ల నా విశ్వాసం దృఢపడింది. అప్పీళ్ళ విషయంలో నాకు భయం లేదు. వాటిలో కూడా గెలిచాను. ఇక బొంబాయి వెళ్ళినా భయం లేదని ధైర్యం కలిగింది.

ఈ విషయం ఎక్కువగా చెప్పేముందు తెల్ల అధికారుల అత్యాచారం, అజ్ఞానం గురించి కలిగిన అనుభవం చెబుతాను. ఈ జ్యుడిషియల్ అసిస్టెంటుగా వున్న ఒక దొర ఎప్పుడూ ఒక చోట వుండడు. ఈయన త్రిపాదిలా ఎక్కడెక్కడికి తిరుగుతూ వుంటాడో వకీళ్ళు, క్లయింట్లు కూడా అక్కడక్కడికి తిరుగుతూ వుండాలి. తమ చోటు విడిచి వచ్చే వకీళ్లకు ఫీజు ఎక్కువ యివ్వవలసివున్నందున క్లయింట్లకు ఖర్చు అధికమైపోత్నుది. ఇదంతా విచారించవలసిన అవసరం జడ్జీకి లేదు కదా!

వేరావల్ అను గ్రామంలో అప్పీలు విచారణ జరుగనున్నది. అక్కడ ప్లేగు ముమ్మరంగా వుంది. రోజుకి 50 మందికి ప్లేగు తాకుతూ వున్నదని గుర్తు. జనాభా దరిదాపు 5,500. దాదాపు గ్రామమంతా శూన్యం. నేను ఒక శూన్యంగా వున్న సత్రంలో విడిది చేశాను. అది గ్రామానికి కొంచెం సమీపాన వుంది. కాని పాపం పార్టీలు ఎక్కడ పుంటారు? బీదవారైతే ఇక వాళ్ల రక్షకుడు భగవంతుడే.

“అక్కడ ప్లేగు వుండటం వలన విచారణను మరోచోటుకి మార్చమని దొర గారిని కోరవచ్చును.” అని ఒక వకీలు మిత్రుడు నాకు తంతి పంపాడు. నేనా విధంగా కోరగా ప్లేగుకు భయపడుతున్నారా అని దొర అడిగాడు.

“ఈ విషయంలో మీరు మా భయాన్ని గురించి యోచించవద్దు. మా సంరక్షణోపాయం మాకు తెలుసు. కాని క్లయింట్ల గతి ఏమిటి?” అడిగాను.

హిందూ దేశంలో ప్లేగు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. దీనికి భయమెందుకు? వేరావల్ ఎంతో మంచిది (దొర గ్రామానికి దూరంగా రాజభవనం లాంటి డేరాలో వున్నాడు) ఈ విధంగా బయట వుండటం అందరికీ నేర్పాలని యిలా చేస్తున్నాను.

ఇది ఆయన వేదాంతం. దీని ముందు యిక నా మాట చలామణి ఎలా అవుతుంది. “గాంధీగారు చెప్పింది గుర్తు పెట్టుకొని వకీళ్ళకు, పార్టీలకు నిజంగా కష్టం కలుగుతూ వుంటే నాకు చెప్పండి” అని దొర శిరస్తాదారుకు చెప్పాడు.