పుట:సత్యశోధన.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

217

ఇద్దరికి పొంతన కుదర్లేదు. నేను ఈ విషయం గోఖ్లేగారికి చెప్పాను. “ఆమె” తేజస్సుగల వనిత. మీ ఇద్దరికి కుదరదు అని గోఖ్లేగారు అన్నారు.

మరోసారి పేస్తన్‌జీ గారి యింట్లో మేమిద్దరం సమావేశమయ్యాము. ఆమె అక్కడ వుండగా నేను వెళ్లాను. ఆమె పేస్తన్‌జీ వృద్ధమాతకు ఉపదేశం ఇస్తున్న సమయం అది. అనుకోకుండా నేను ఇద్దరికీ మధ్య దుబాసి అయినాను. సోదరి నివేదితకు నాకు భావైక్యత లేకపోయినా, ఆమెకు హిందూ మతం యెడ గల అగాధ ప్రేమను గమనించాను. ఆమె రచించిన గ్రంథాలు ఆ తరువాత దక్షిణ ఆఫ్రికా కార్యాలయం కోసం కొన్నాను. కలకత్తా లోని నాయకుల్ని దర్శించడానికి మిగతా అర్ధదినం, ధార్మిక సంస్థల్ని, ఇతర సార్వజనిక సంస్థల్ని దర్శించేందుకు వెచ్చించాలని నిర్ధారించుకున్నాను.

నేనొక రోజున డాక్టరు మల్లిక్ గారి అధ్యక్షతన జరిగిన సభలో బోయర్ యుద్ధంలో భారతీయుల సేవాబృందం చేసిన పనిని గురించి ఉపన్యసించాను, “ఇంగ్లీష్‌మన్” పత్రికాధిపతి పరిచయం ఇప్పుడు కూడ నాకు ఉపయోగపడింది. సాండర్సుగారికి ఇప్పటికీ సుస్తీగానే వుంది. అయితే 1896 లో నాకు ఏవిధంగా సాయం చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా సాయం చేశారు. నా ఈ ఉపన్యాసానికి గోఖ్లేగారు సంతోషించారు. డాక్టరు రాయ్‌గారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించే సరికి యింకా సంబరపడ్డాను. నేనీ విధంగా గోఖ్లేగారి గొడుగు నీడన వుండటం వల్ల బెంగాల్ ప్రాంతంలో నాపని తేలిక అయింది. బెంగాల్ నందు గొప్ప గొప్ప కుటుంబాల వారితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. చిరస్మరణీయాలైన సంగతులు ఈ కాలానికి సంబంధించినవి చాలా వున్నాయి. కాని వాటిని ఇక్కడ వివరించడం లేదు. ఈ సమయంలో బ్రహ్మ దేశ (బర్మా) వెళ్లి వచ్చాను. అక్కడి వూంగీలను (సన్యాసుల్ని) కలిశాను. వాళ్ల సోమరితనం చూచి నాకు నవ్వు వచ్చింది. బంగారు పెగోడాలు (గోపురాలు) చూచాను. దేవళంలో లెక్కలేనన్ని కొవ్వొత్తులు వెలుగుతూ వున్నాయి. అవి నాకు నచ్చలేదు. గర్భాలయంలో పరుగెత్తుతున్న ఎలుకల్ని చూచేసరికి దయానందస్వామి వారి అనుభవం గుర్తుకు వచ్చింది. బ్రహ్మదేశంలో స్త్రీ ఉత్సాహాన్ని చూచి సంతోషించాను. కాని పురుషుల మాంద్యం చూచి విచారించాను. బొంబాయి ఎట్లా హిందూ దేశం కాదో, అట్లే రంగూను బ్రహ్మదేశం కాదని చూచి తెలుసుకున్నాను. హిందూ దేశంలో మనం ఇంగ్లీషు వర్తకులకు కమీషన్ ఏజంట్లుగా భావించి వ్యవహరిస్తున్నట్లే, ఇంగ్లీషు వాళ్లు అక్కడి వర్తకులతో కలిసి బ్రహ్మదేశం వాళ్ళను కమీషన్ ఏజంట్లుగా చేసుకొన్నారని నాకు బోధపడింది.